జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన..

ఈసారి హైదరాబాద్‌లో అన్న నందమూరి తారక రామారావు జయంతి ఏర్పాట్లు ఎవరూ పట్టించుకునే వాళ్లే లేకుండాపోయారా..? జూనియర్ ఎన్టీఆర్ ఇదే ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ తెల్లవారుజామునే సోదరుడు కల్యాణ్‌రామ్‌తో కలిసి ట్యాంక్‌బండ్ దగ్గరున్న NTR ఘాట్‌కి వెళ్లారు. ఐతే.. అక్కడ సమాధి ప్రాంగణాన్ని చూసాక ఆయన మనస్సు చివుక్కుమంది. అలంకరణ సరిగా లేకపోవడంతో ఆ బాధ ఆయన ముఖంలో స్పష్టంగా కనిపించింది. వెంటనే తాను తెచ్చిన పూలను.. స్వయంగా సమాధిపై చల్లారు. తెలుగుప్రజల ఆరాధ్యదైవమైన మహానాయకుడికి సముచిత రీతిలో గౌవరం ఇవ్వకపోతే ఎలాగని అసహనం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది నుంచి జయంతి ఏర్పాట్లను తానే చూసుకుంటానని అన్నారు. నివాళులు అర్పించిన తర్వాత సమాధి వద్దే కాసేపు కూర్చుని తాతను స్మరించుకున్నారు. వెళ్తూ వెళ్తూ సమాధి అలంకరణకు ఏమేమి చెయ్యాలో తన అనుచరులకు చెప్పారు. కాసేపటికి పూలతో అలంకరించడంతో.. ఘాట్‌కి కళ వచ్చింది.

జూనియర్ ఎన్టీఆర్‌కి తాత అంటే వల్లమాలిన అభిమానం. తాను ఈ స్థాయికి చేరానంటే అది పెద్దాయనే భిక్షే అంటారు. అందుకే జయంతి, వర్థంతి సందర్భాల్లో అందరికంటే ముందే ఘాట్‌కి రావడం.. నివాళులు అర్పించడం చేస్తుంటారు. ఈసారి ఏర్పాట్లు అరకొరగా ఉండడంతో మనస్తాపం చెందిన జూనియర్.. వెళ్లేప్పుడు మీడియాతో కూడా మాట్లాడలేదు.

Next Story

RELATED STORIES