పవన్‌తో బండ్ల గణేష్.. భారీ సినిమా..?

ప్రజలే నా జీవితం.. ప్రజా శ్రేయస్సే నా ధ్యేయం.. ప్రజా సమస్యలపైనే నా పోరాటం. డబ్బు కోసమే సినిమాలు చేశాను కానీ.. నా ఆలోచనలన్నీ సమాజం గురించి, సమాజంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తరచూ చెప్పే మాట. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన జన సేన అధినేత తన పంధాని మార్చుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌తో బండ్ల గణేశ్ సినిమా చేయబోతున్నారనే వార్త చర్చనీయాంశం అయింది. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈ వార్తలో నిజం లేకపోలేదనే వారూ ఉన్నారు. పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీకి దిగిన పవన్ కళ్యాణ్ తన దగ్గర ఉన్న డబ్బంతా ఎన్నికల కోసం ఖర్చు పెట్టేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడాలంటే సినిమా తప్ప మరో దారి లేదని బండ్ల గణేష్ పవన్‌కి సూచిస్తున్నారట.
తనతో సినిమా చేస్తే రూ.40 కోట్ల పారితోషికం ఇస్తానని ఆఫర్ చేసాడట. ఈ సినిమా బాధ్యతలు దర్శకుడు బోయపాటి శ్రీనుకు అప్పగించినట్లు వార్తల సారాంశం. సినిమా బడ్జెట్‌కు రూ.100 కోట్లు కేటాయించారట గణేష్. పారితోషికాల కింద రూ.50 కోట్లు పోయినా, మిగిలిన రూ.50 కోట్లతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. గతంలో వీరిద్దరి జోడీలో వచ్చిన గబ్బర్ సింగ్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
కాగా, పవన్ మళ్లీ సినిమాల్లోకి వస్తారా అనే అనుమానం కలుగుతుంది జనాల్లో. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుంచి ప్రజలకు చేరువగా ఉండాలి. ఇది సినిమాల్లో ఉంటే అసాధ్యం. ప్రజలకు జన సేనపై నమ్మకాన్ని కలుగ జేయాలన్నా, ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలన్నా పవన్ ప్రజలతోనే ఉండాలని, అందుకోసం ఆయన చాలా కష్టపడాల్సిన అవసరం ఉందని మరికొందరి అభిప్రాయం. లేకపోతే జనం.. జనసేనను మర్చి పోయే అవకాశాలు ఉన్నాయని వారంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com