తాజా వార్తలు

పార్టీ మారుతున్నట్లు వస్తున్న వదంతులపై స్పందించిన రేవంత్

పార్టీ మారుతున్నట్లు వస్తున్న వదంతులపై స్పందించిన రేవంత్
X

మూడు ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో ఫుల్ జోష్‌లో ఉంది తెలంగాణ కాంగ్రెస్. 16 ఎంపీలు గెలుస్తామన్న టీఆర్ఎస్ అహంకారానికి ప్రజలు తగిన బుద్ధిచెప్పారన్నారు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేలా కేసీఆర్ వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ముగ్గురు కాంగ్రెస్‌ ఎంపీలకు గాంధీ భవన్‌లో పార్టీ కార్యకర్తలు సన్మానం చేశారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిలను శాలువాలతో సత్కరించారు.

2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన ఏ హామీని కూడా కేసీఆర్ నిలబెట్టుకోలేదని ఉత్తమ్ విమర్శించారు. విభజన చట్టంలో ఉన్న వాటిని తీసుకువచ్చేంత వరకు తెలంగాణ ప్రజల తరపున పార్లమెంటులో పోరాడుతామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేసినా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదనే విషయాన్ని ఈ ఎన్నికలు రుజువు చేశాయన్నారు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి… కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకుని కాంగ్రెస్‌ని అణచివేయాలని కేసీఆర్ చూశారని విమర్శించారు

ప్రశ్నించే గొంతుక ఉండాలనే తమను ప్రజలు ఆదరించారని అన్నారు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి. మోదీ దేశ విచ్ఛిన్నకర రాజకీయాలను పార్లమెంట్‌లో నిలదీస్తామన్నారు. తాను పార్టీ మారతానని వచ్చే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు రేవంత్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు, కార్యకర్తలకు అండగా ఉండేందుకు సమిష్టిగా కృషి చేస్తామని ముగ్గురు ఎంపీలు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు.

Next Story

RELATED STORIES