మోదీతో పాటు మంత్రులుగా ప్రమాణం చేయనున్న..

రెండోసారి ప్రధానిగా నరేంద్రుని పట్టాభిషేక మహోత్సవానికి రంగం సిద్ధమైంది. అతిరథ మహారథులు, దేశ-విదేశీ ప్రముఖులు, విశిష్ట అతిథుల సమక్షంలో మోదీ ప్రమాణ స్వీకార ఘట్టం జరగనుంది. ఈ సాయంత్రం 7 గంటల 1 నిమిషానికి రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు నరేంద్ర మోదీ. ప్రధానిగా మోదీతో పాటు మరికొంతమంది ఎంపీలు మంత్రులుగా నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో కాకుండా రాష్ట్రపతి భవన్ ముందు భాగంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇలా చేయడం స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇది నాలుగోసారి మాత్రమే. గతంలో మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్‌పేయి, చంద్రశేఖర్‌ ప్రమాణ స్వీకారోత్సవం ఇక్కడే జరిగింది. సాధారణంగా రాష్ట్రపతి భవన్ ప్రాంగణాన్ని విదేశీ అతిథులు, ప్రభుత్వాధినేతలు, ఇతర ప్రముఖులకు స్వాగతం పలకడానికి ఉపయోగిస్తారు. 2014లో సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత మోదీ తన ప్రమాణ స్వీకారాన్ని దర్బార్ హాల్‌లో కాకుండా రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలోనే జరుపుకున్నారు. ఈసారి కూడా అదే పద్దతి కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.

మోదీ ప్రమాణ స్వీకా రోత్సవంలో దేశ-విదేశీ ప్రముఖులు, విశిష్ట అతిథులు పాల్గొననున్నారు. 2014లో సార్క్ దేశాల అధినేతలు హాజరు కాగా… ఈసారి బిమ్స్‌టెక్ సభ్య దేశాల అధినేతలు హాజరుకానున్నారు. బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ హమీద్‌, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరి సేన, నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి, మయన్మార్‌ అధ్యక్షుడు యువిన్‌ మైంట్‌, భూటాన్‌ ప్రధాని లోటె షెరింగ్‌ థాయ్‌లాండ్‌ ప్రత్యేక రాయబారి గ్రిసాద బూన్‌రాక్‌, మారి షస్‌ ప్రధాని ప్రవీణ్‌ కుమార్‌ జగన్నాధ్‌లు మోదీ ఓత్ సెర్మనీలో పాల్గొననున్నారు.

మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చీఫ్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగ ప్రముఖులు మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు. దాదాపు 8 వేల మంది అతిథుల సమక్షంలో మోదీ ప్రమాణ స్వీకారం జరగనుంది. ప్రమాణ స్వీకారం తరువాత 6 వందల మంది ముఖ్య అతిథులకు రాష్ట్రపతి భవన్‌లో విందు ఇవ్వనున్నారు. సమావేశానికి హాజరయ్యే అతిథుల కోసం ఈ సారి ప్రత్యేక వంటలను సిద్ధం చేస్తున్నారు. భారతీయ సంప్రదాయ వంటలతో పాటు పాశ్చత్య వంటకాలను కూడా వడ్డించనున్నట్లు రాష్ట్రపతి భవన్‌ వర్గాలు చెబుతున్నాయి.

Tags

Next Story