మోదీ కేబినెట్‌.. మంత్రివర్గంలోకి పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా?

మోదీ కేబినెట్‌..  మంత్రివర్గంలోకి పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా?

రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తున్న నరేంద్రమోదీ తన మంత్రివర్గంలోకి 60 మందిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సీనియర్లతో పాటు అనేకమంది కొత్త ముఖాలకు ఈసారి అవకాశం లభించే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించినవారిలో 300 మంది కొత్తవారున్నారు. తొలిసారి ఎన్నికైనవారు కావడంతో అందుకు తగ్గట్టే మంత్రివర్గాన్ని కూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి యువతకు పెద్ద పీట వేస్తారని ప్రచారం జరుగుతోంది. విపక్షాలకు చెందిన ప్రముఖ నాయకులను ఓడించిన బీజేపీ ఎంపీలకు కూడా ఈ మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో ఎవరికి అవకాశం ఇస్తారన్నది మోదీ, అమిత్‌ షా తమ ఇద్దరి మధ్యే గోప్యంగా ఉంచుకున్నారు. కొత్త మంత్రులకు తామే స్వయంగా ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. ఊహాగానాలకు ఎలాంటి తావివ్వలేదు.

గత మూడురోజులుగా అనేక మార్లు కలిసిన మోదీ, అమిత్‌ షా బుధవారం ఐదు గంటలపాటు నిర్విరామంగా కూర్చుని జాబితా ఖరారు చేశారు. అర్థరాత్రి దాకా ఇద్దరూ మంత్రి వర్గ విస్తరణపై చాలావరకు కసరత్తు చేశారు. కాగా మంత్రివర్గంలో పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా ఉండే అవకాశాలున్నాయని వినిపిస్తున్నప్పటికీ ఇప్పటిదాకా ఈ విషయమై స్పష్టత లేదు. ఈ ఏడాది ఆఖరులో జరిగే మహారాష్ట్ర, జార్ఖండ్‌, హర్యానా ఎన్నికలు పూర్తయ్యే వరకూ అమిత్‌ షాయే అధ్యక్షుడుగా కొనసాగుతారని కూడా ఒక వర్గం చెబుతోంది. ఒకవేళ ఆయనను తీసుకుంటే హోం లేదా రక్షణ మంత్రిత్వ శాఖల్లో ఏదో ఒకటి అప్పగించే అవకాశాలున్నాయి. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కూడా తీసుకుంటారా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. అనారోగ్య కారణాలతో ఆమె ఈసారి పోటీచేయలేదు. ఆమెను రాజ్యసభకు పంపి అదే పదవిలో కొనసాగించవచ్చని కూడా వినిపిస్తోంది.

అరుణ్‌ జైట్లీకి శాఖ కేటాయింపుపైనా తర్జనభర్జన నెలకొంది. మంత్రివర్గంలోకి తనను తీసుకోవద్దని అరుణ్‌ జైట్లీ కోరాక- ప్రధాని మోదీ ఆయన నివాసానికి వెళ్లడం చర్చనీయాంశమయ్యింది. నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని మోదీ ఆయనను కోరినట్టు ప్రచారం సాగుతోంది. గత మంత్రివర్గంలో ఉన్న రాజ్‌ నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, పీయూ్‌ష్‌ గోయెల్‌, స్మృతీ ఇరానీ, నిర్మలా సీతారామన్‌, సురేశ్‌ ప్రభు, రవిశంకర్‌ ప్రసాద్‌, ప్రకాశ్‌ జావడేకర్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, అర్జున్‌ సింగ్‌ మేఘ్‌వాల్‌ కేంద్ర కేబినెట్‌లో కొనసాగే అవకాశాలున్నాయి. అప్నాదళ్‌ కు చెందిన అనుప్రియా పాటిల్‌ కు కేబినెట్‌ హోదా లభించవచ్చు. గత కేబినెట్లో పనిచేసిన సీనియర్‌ నేత ఉమాభారతికి పార్టీ ఉపాధ్యక్ష పదవిని అప్పగించడంతో ఆమెను మళ్లీ తీసుకోకపోవచ్చని ప్రచారం జరుగుతోంది.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. కిషన్‌రెడ్డికి స్వతంత్ర హోదాలో సహాయమంత్రి ఇస్తారని బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన చేరిక ఖరారని వార్తలు రావడంతో ఆయన బుధవారమే ఢిల్లీ వెళ్లినట్లు సన్నిహితులు తెలిపారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో 18 సీట్లు గెలిచిన శివసేన, 16 సీట్లు గెలిచిన జేడీయూ, ఆరు సీట్లు గెలిచిన లోక్‌ జనశక్తి పార్టీ, 2 సీట్లు గెలిచిన అకాలీదళ్‌ కు మంత్రివర్గంలో భాగస్వామ్యం కల్పించే అవకాశాలు ఉన్నాయి. జనతాదళ్‌ (యు)కు రెండు శాఖలు, శివసేనకు రెండు శాఖలు అప్పగించే అవకాశాలున్నాయి. శివసేన నుంచి అనిల్‌ దేశాయ్‌, అరవింద్‌ సావంత్‌, సంజయ్‌ రావత్‌, జేడీయూ నుంచి రాంచంద్రప్రసాద్‌ సింగ్‌, రవిరంజన్‌, అకాలీదళ్‌ నుంచి హర్‌ సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌, లోక్‌ జనశక్తి నుంచి రాంవిలాస్‌ పసవాన్‌ లేదా చిరాగ్‌ పసవాన్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. కాగా ప్రొటెమ్‌ స్పీకర్‌ గా వ్యవహరించనున్న సీనియర్‌ నేత అయిన సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ కు అవకాశం లభించవచ్చునని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story