మిత్రపక్షాలకు ఝలక్.. మోదీ, అమిత్ షాల భారీ స్కెచ్?

ప్రధాని మోదీ సహా 58 మందితో కేంద్ర కేబినెట్‌ కొలువుదీరింది. అయితే పార్టీలో కొందరు సీనియర్లు సహా మిత్రపక్షాలకు తీవ్ర నిరాశే ఎదురైంది. బీహార్‌లో నితీష్ నేతృత్వంలోని జేడీయూ 11 సీట్లు గెలుచుకుంది. అయితే ఆ పార్టీకి ఒక కేబినెట్‌ మంత్రి పదవి ఇస్తామన్నారు. కానీ నితీష్ రెండు బెర్త్‌లు కోరారు. ఆశించింది దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన జేడీయూ కేబినెట్‌లో చేరలేదు.

అయితే జేడీయూకు ఒక్క బెర్త్‌ మాత్రమే ఇస్తాననడం వెనుక మోదీ, షాల భారీ స్కెచే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బీహార్ లో కాంగ్రెస్, ఆర్జేడీల ఖేల్‌ ఖతమైంది. జేడీయూ బీజేపీ మిత్రపక్షంగా ఉంది. భవిష్యత్‌ లో బీహార్‌లో పాగా వేయాలని కమలనాథులు చూస్తున్నారు. అందుకే జేడీయూను పొమ్మనలేక పొగ బెట్టినట్టు సమాచారం. కావాలనే ఒక్క సీటు ఇస్తామని ఆ పార్టీని రెచ్చగొట్టినట్టు తెలుస్తోంది. అసంతృప్తితో జేడీయూ కూటమి నుంచి వైదొలిగినా మోదీ సర్కారుకు వచ్చే నష్టమేమే లేదు. ఎందుకంటే బీజేపీకి లోక్‌సభలో భారీ మెజారిటీ ఉంది. ఇక జేడీయూ కూటమి నుంచి బయటకు వెళ్తే బీహార్‌లో ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదుగొచ్చన్నది కమలనాథుల వ్యూహంగా కనిపిస్తోంది.

మరోవైపు 2014లో రెండు మంత్రి పదవులు కావాలని పట్టుబట్టిన శివసేన ఈసారి రెండు బెర్త్‌లు కావాలని కోరింది. కానీ మోదీ ఆ పార్టీ కేవలం ఒకేఒక మంత్రి పదవి ఇచ్చారు. భాగస్వామ్యపక్షాలకు ఒక్కొక్క బెర్త్‌ ఇవ్వాలని బీజేపీ నిర్ణయించిందని శివసేన తెలిపింది. మోదీ కేబినెట్‌లో ఈసారి అప్నాదల్‌ ఎంపీ అనుప్రియా పటేల్‌కు చుక్కెదురైంది. యూపీలో ఒక్క జిల్లాకు మాత్రమే పరిమితమైంది అప్నాదల్‌. అయితే ప్రస్తుతం యూపీలో యోగీ ఆదిత్యనాథ్ హవా నడుస్తోంది. అందుకే ఒకే ఒక్క జిల్లాకు పరిమితమైన అనుప్రియాప పటేల్‌ను పట్టించుకోలేదనే ప్రచారం జరుగుతోంది. ఇక మరో మిత్రపక్షమైన తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకు నిరాశే ఎదురైంది. ఆ పార్టీకి ఒక పదవి కూడా దక్కలేదు. మొన్నటి ఎన్నికల్లో 38 ఎంపీ సీట్లలో 37 స్థానాల్లో డీఎంకే విజయం సాధించింది. అన్నాడీఎంకే నుంచి రవీంద్రనాథ్ కుమార్ ఒక్కరే గెలుపొందారు. అయితే ఆ పార్టీకి రాజ్యసభలో సీనియర్‌సభ్యులున్నారు. కానీ మోదీ అన్నాడీఎంకేకు వ్యూహాత్మకంగానే బెర్త్‌ ఇవ్వలేదని సమాచారం. మొత్తం మీద కేబినెట్‌ కూర్పులో మోదీ-షా మార్క్‌ స్పష్టంగా కనిపించింది. ఈసారి బీజేపీకి మేజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి. మిత్రపక్షాలతో పనే లేదు. అందుకే మోదీ వాటికి మొండికి చూపినట్టు సమాచారం.

Next Story

RELATED STORIES