పార్లమెంటరీ పక్ష నేతగా రాహుల్‌..?

కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ శనివారం భేటీ కానుంది. సమావేశం కానున్న కాంగ్రెస్‌ ఎంపీలు పార్టీ పార్లమెంటరీ నేతను ఎన్నుకోనున్నారు. గెలిచిన 52 మంది ఎంపీలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. అయితే పార్లమెంటరీ పార్టీ నేతగా ఎవరిని ఎన్నుకుంటారు అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో ఘోర పరాజయంతో కాంగ్రెస్‌లో ఒకింత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మొన్న జరిగిన సీడబ్యూసీ సమావేశంలో ఏకంగా రాజీనామా చేసేందుకు సిద్ధ పడ్డారు పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ. అధ్యక్ష బాధ్యతలను వేరే వ్యక్తి అప్పగించాలని నిర్ణయించారు. అయితే పార్టీ సీనియర్లు నచ్చజెప్పడంతో రాజీనామా నుంచి వెనక్కి తగ్గారు ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవికే రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డ రాహుల్‌.. పార్లమెంటరీ పక్ష నేతగా ఉండేందుకు అంగీకరిస్తారా అన్నదాని చర్చనీయాంశంగా మారింది.

గత ఐదేళ్లు పార్లమెంటరీ పక్ష నేతగా పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జునా ఖర్గే బాధ్యతలు నిర్వహించారు. కానీ ఈ సారి ఆయన పరాజయం పాలవడంతో పార్లమెంటరీ పక్ష నేతను ఎవరిని ఎన్నుకోవాల అన్న చర్చ పార్టీ హైకమాండ్‌లో జోరుగా సాగుతోంది. రాహుల్‌ పార్లమెంటరీ పక్ష నేతగా ఉండేందుకు అంగీకరిస్తారా? లేదా మరో కొత్త నేతను తెరపైకి తీసుకొస్తారా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

మరోవైపు గతంలోలాగే ఈ సారి కూడా కాంగ్రెస్‌కు ప్రతిపక్ష పాత్ర దక్కలేదు. ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం 54 సీట్లు గెలిచి ఉండాలి. కానీ తాజా ఎన్నికల్లో 52 వరకే ఆగిపోయింది హస్తం పార్టీ. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష హోదాను దక్కించుకునేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం అన్ని ప్రయత్నాలను చేస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో ఎన్సీపీ విలీనం అవుతుందంటూ ఊహాగానాలు వస్తున్నాయి. తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో రాహుల్ గాంధీ సమావేశం కావడంతో ఈ వార్తలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.ముఖ్యంగా ఎన్సీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంపై సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది.

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 52 స్థానాల్లో విజయం సాధించగా.. ఎన్సీపీ -5 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 10 శాతం అంటే 54 సీట్లు రావాలి. అంటే కాంగ్రెస్‌కు మరో ఇద్దరు ఎంపీలు కావాలి. ఎన్సీపీ విలీనం అయితే కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాకు అర్హత సాధిస్తుంది. అలాగే సెప్టెంబర్ లో జరిగే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఇది ఉపయోగడుతుందని ఇరు పార్టీలు భావిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story