తొలి కేబినెట్‌లో మోదీ వరాలు

కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కారు.. తొలి కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకుంది. శుక్రవారం సాయంత్రం మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో… హోంమంత్రి అమిత్‌షా తో 24 మంది క్యాబినెట్‌ మంత్రులు, 9 మంది స్వతంత్రహోదా మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయరంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. దేశంలోని రైతులందరికీ ప్రధాన మంత్రి కిసాన్‌ యోజన పథకం అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో అదనంగా రెండు కోట్ల మంది రైతులకు లబ్ది చేకూరుతుంది. ఇప్పటి వరకు ఈ పథకానికి 75వేల కోట్లు ఖర్చవుతుండగా ఇకపై లక్షా 30వేల కోట్లు ఖర్చు కానుంది.

అలాగే చిన్న సన్నకారు రైతులకు పించను పథకానికి కూడా కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. 60 ఏళ్లు వయస్సు దాటిన రైతులందరికి నెలకు 3 వేల చొప్పున పెన్షన్‌ ఇస్తామన్నారు. రైతులు చెల్లించే సొమ్ముతో సమానమైన సొమ్ము కేంద్రం కంట్రిబ్యూషన్‌గా ఇస్తుందని తెలిపారు. ఇక … చిరు వ్యాపారులకు పెన్షన్‌ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ నిర్ణయంతో దాదాపు 3 కోట్ల మందికి లబ్ది చేకూరుతుంది. దేశ రక్షణ నిధి నుంచి అమరులైన సైనికుల పిల్లలకు ఇచ్చే ఉపకారవేతనాలను పెంచుతూ.. నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు 2వేల నుంచి రెండున్నర వేలకు, విద్యార్థినులకు రెండు వేల 250 నుంచి 3 వేలకు పెంచారు. కేంద్ర పారామిలటరీ బలగాలతో పాటు, రాష్ట్రంలో అమలు అయ్యే పోలీసు కుటుంబాలకు కూడా ఈపథకాన్ని వర్తింపచేస్తారు. ఏడాదికి 500 మంది రాష్ట్ర పోలీసు విభాగాలకు చెందిన వారి నుంచి ఇకపై ఎంపిక చేయనున్నారు. మరోవైపు.. ఈ నెల 17 నుంచి జూలై 26 వరకు పార్లమెంట్‌ తొలి సమావేశాలు నిర్వహించాలని కేంద్రమంత్రి మండలి నిర్ణయించింది. జూన్‌ 19న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక చేపట్టనున్నారు. జూన్‌ 20న పార్లమెంట్‌ ఉభయసభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. జూలై 4న ఆర్ధిక సర్వే, ఐదున కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

Tags

Read MoreRead Less
Next Story