తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ.. ఆ మంత్రుల పదవులకు ముప్పు?

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ.. ఆ మంత్రుల పదవులకు ముప్పు?

రాష్ట్రంలో వ‌రుస ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌టంతో ఇప్పటివరకు పూర్తి స్థాయి విస్త‌ర‌ణ చేపట్టలేకపోయారు సీఎం కేసీఆర్‌. అయితే.. ప్రస్తుతం దాదాపుగా అన్ని ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో ఇప్పుడు మంత్రివర్గవిస్తరణపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. మిగిలిన 6 మంత్రి ప‌ద‌వుల్ని జెడ్పిటిసి,ఎంపిటిసి ఫలితాలు వెలువ‌డిన కొద్ది రోజుల‌కే భర్తీ చేసే అవకాశాలున్నాయి. దీనిపై ఇప్పటికే కేసిఆర్ క‌స‌ర‌త్తు చేసిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ ఆరు స్ధానాల్లో ఎవ‌రెవ‌రికి ఛాన్స్ ద‌క్కుతుంద‌న్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

గ‌త కేబినెట్ లో కీల‌క బాధ్యతలు చేప‌ట్టిన కేటిఆర్ , హ‌రీష్ రావు లో తో పాటు మాజీ మంత్రి ల‌క్ష్మారెడ్డికి ఈ సారి చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ వేదిక‌గా ఇద్ద‌రు మ‌హిళా మంత్రుల‌కు అవ‌కాశం ఇస్తామ‌ని గతంలో హామి ఇచ్చారు. దీంతో స‌బితా ఇంద్రా రెడ్డికి, సత్య‌వ‌తి రాథోడ్‌ మంత్రివర్గంలో చోటుదక్కే అవకాశం ఉంది. మిగిలిన ఒక్క పదవిని ఎవరితో భర్తీ చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్‌. గ‌త విస్త‌ర‌ణ‌లో అన్ని జిల్లాల‌కు ప్రాధాన్య‌త ద‌క్క‌లేదు కాబ‌ట్టి .. ఈ సారి అన్ని స‌మీక‌ర‌ణాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోనున్న‌ట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలపై కేసీఆర్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సిట్టింగ్ ఎంపిలు ఓడిపోవ‌డం, ఇంచార్జి మంత్రులు సరిగా పనిచేయ‌క పోవ‌డం, ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ప‌నిచేయడం వంటి అంశాలపై ఆయన సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్ర‌భావం మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ పై కూడా ఉంటుంద‌ని భావిస్తున్నారు గులాబీనేతలు. ప్ర‌స్తుత కేబినెట్ లో ఉన్న ఒక‌రిద్ద‌రిని ఉద్వాస‌న పలికే అవ‌కాశాలున్నాయ‌న్న ప్రచారమూ జరుగుతోంది. ఇదే జ‌రిగితే నిజామాబాద్ , క‌రీంన‌గ‌ర్, న‌ల్గొండ జిల్లాల మంత్రుల‌కే ముప్పు ఖాయ‌మంటున్నారు టిఆరెస్ శ్రేణులు. ఈసారి మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్కించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు నేతలు. ఇది చివ‌రి అవ‌కాశం కావ‌డంతో కేసిఆర్ ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ఇప్ప‌టికే అన్ని ప్ర‌య‌త్నాలు చేశారు. మంత్రివర్గవిస్తరణకు కేసీఆర్‌ ఎప్పుడు ముహూర్తం పెడతారో అందులో ఎందరికి అవకాశం ఉంటుందోనని టీఆర్‌ఎస్‌ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story