తాజా వార్తలు

రైతులకు మరో రూ. లక్ష రుణమాఫీ - కేసీఆర్

రైతులకు మరో రూ. లక్ష రుణమాఫీ - కేసీఆర్
X

గడిచిన ఐదేళ్లలో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించిందన్నారు సీఎం కేసీఆర్. తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎన్నో పథకాలు ప్రపంచం దృష్టిని ఆకర్శించాయని చెప్పారు. రైతులకు మరో లక్ష రుణమాఫీ చేయబోతున్నట్లు ప్రకటించారు. పబ్లిక్‌ గార్డెన్స్‌లో ఘనంగా జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు.

ఐదు వసంతాలు పూర్తి చేసుకొని.. ఆరో ఏట అడుగుపెట్టింది తెలంగాణ. రాష్ట్ర అవతరణ వేడకలను ఘనంగా నిర్వహించారు. గత సంప్రదాయానికి భిన్నంగా ఈసారి పరేడ్ గ్రౌండ్ లో కాకుండా పబ్లిక్ గార్డెన్స్ లో అవతరణ వేడుకలను నిర్వహించింది ప్రభుత్వం. అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన తర్వాత.. పబ్లిగ్ గార్డెన్స్ చేరుకున్నారు సీఎం. అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు.

తెలంగాణ సఫల రాష్ట్రంగా పురోగమిస్తోందన్నారు సీఎం కేసీఆర్. ఒకప్పుడు జోకులు వేసిన వారంతా ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిని చూసి అవాక్కవుతున్నారని అన్నారు. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం గట్టారని చెప్పారు. తెలంగాణ బలమైన ఆర్ధిక శక్తిగా మారిందని, కరెంట్ సమస్యను పరిష్కరించుకున్నామని చెప్పారు సీఎం. కోటికిపైగా ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్న ధృడ సంకల్పంతో గోదావరి, కృష్ణా నదులపై చేపట్టిన భారీ ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది అన్నారు. రాష్ట్రంలో రైతులకు మరో లక్ష రుణమాఫీ చేయబోతున్నామని ప్రకటించారు కేసీఆర్. రైతుబంధు పథకం ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని, కేంద్రం ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి రైతు బంధే ప్రేరణ అని చెప్పారు. పెంచిన ఆసరా ఫించన్లు జులై ఒకటో తేదీ నుంచి అందుతాయని వెల్లడించారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు అద్భుతమైన పురోగతి సాధించాయన్నారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం తెలంగాణ ప్రజలకు చేరువకావాలని కోరుకుంటున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌‌లో ట్వీట్ చేశారు. నారా లోకేష్ కూడా తెలంగాణ ప్రజలకు శుక్షాకాంక్షలు తెలిపారు.

Next Story

RELATED STORIES