తాజా వార్తలు

జూన్ చివరికల్లా పనులు పూర్తి అవ్వాల్సిందే.. - కేసీఆర్

జూన్ చివరికల్లా పనులు పూర్తి అవ్వాల్సిందే.. - కేసీఆర్
X

జులై నాటికి కాళేశ్వరం నుంచి నీటిని పంప్ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. వచ్చే నెల 15 నాటికి పనులు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరం పునుల పురోగతిని పరిశీలించిన సీఎం.. గోదావరికి ఇరువైపుల ఉన్న కరకట్ట నిర్మాణ పనులపై ఆరా తీశారు.గోదావరి జలాలతో తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ దిశగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా 20 రోజుల వ్యవధిలోనే సీఎం కేసీఆర్ రెండో సారి ప్రాజెక్ట్ నిర్మాణ పునుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టులో భాగమైన రాంపూర్, మేడిగడ్డ ప్రాజెక్టు పనులపై ఆరా తీశారు. మోటర్ల బిగింపు పనుల పురోగతిపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

జులైలో కాళేశ్వరం నీరు అందిస్తామని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో జులై 15 లోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిపై రెండు రోజులకు ఒకసారి సమీక్ష చేయాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డికి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జులై నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిడ్‌మానేరుకు, ఎస్సారెస్పీకి నీటి పంపింగ్ జరగాలన్నారు. కాళేశ్వరం నీటి కోసం తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా రైతులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారని గుర్తుచేశారు. ప్రాజెక్టుతో దశాబ్దాల సాగునీటి కష్టాలకు తెరపడుతుందని నమ్మకంతో ఉన్నారని అన్నారు. ప్రజల ఆశయాలను తగ్గట్టుగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాలని..అవసరమైతే ఎక్కువ మంది సిబ్బందిని నియమించి రేయింబవళ్లు పని చేయాలని దిశానిర్దేశం చేశారు సీఎం. అటు మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించిన సీఎం.. బ్యారేజీ 85 గేట్ల బిగింపు పనులతో పాటు, గోదావరికి ఇరువైపుల నిర్మిస్తున్న కరకట్ట పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. జూన్ చివరికల్లా పనులు పూర్తి అవ్వాల్సిందేనని ఆదేశించారు. అనంతరం గోదారి దారిలో బురదలో నడుచుకుంటూ వెళ్లి గోదారమ్మకు నమస్కరించారు.

Next Story

RELATED STORIES