ఆఖరికి తన భార్యను కూడా గెలిపించుకోలేకపోయాడు

ఆఖరికి తన భార్యను కూడా  గెలిపించుకోలేకపోయాడు

బీజేపీని ఓడించడమే లక్ష్యంగా జట్టు కట్టిన ఎస్పీ-బీఎస్పీకి సార్వత్రిక ఎన్నిక ఫలితాలు ఊహించని షాక్‌ ఇచ్చాయి. కమలం హవాను మహాకూటమి ఏ మాత్రం నిలువరించలేకపోయింది. దీనికి కారణం ఆయనే అంటున్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి? అసలు కూటమి ఓటమికి కారణం ఎవరు?

సార్వత్రిక ఎన్నికల ముందు ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఎవరూ ఊహించని విధంగా… బీజేపీని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఒక్కటైన సమాజ్‌వాదీ-బహుజన్‌ సమాజ్‌ వాదీ పార్టీలు.. మహాఘట్‌ బంధన్‌ పేరుతో లోక్‌సభ ఎన్నికల బరిలో దిగాయి. దీంతో ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలు కొత్త టర్న్‌ తీసుకున్నాయి.

మహాఘట్‌ బంధన్‌పై అంచనాలు పెరిగిపోయాయి. ఉత్తర ప్రదేశ్‌లో ఇక బీజేపీకి ఎదురు గాలి తప్పదని అంతా భావించారు. అంతే కాదు మహాఘట్‌ బంధన్‌ మెజారిటీ సీట్లు దక్కించుకుంటుందని ఎగ్జిట్‌పోల్స్‌ కూడా ఊదరగొట్టాయి. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. కేవలం 15 సీట్లకే పరిమితమైంది మహాకూటమి.

.

లోక్‌సభ ఫలితాలతో మహాగట్‌బంధన్‌లో లుకలుకలు మొదలయ్యాయి. పార్టీ ఓటమి తరువాత ఎవరో ఒకరిపై నెపాన్ని మోపడం సాధారణం. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతోంది. ఎన్నికల ఫలితాలపై తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతి ఘాటుగా స్పందించారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ వల్లే ఇంత దారుణంగా ఓడిపోయామని విమర్శించారు. కూటమి ఓటమికి అఖిలేషే బాధ్యుడని ఆరోపించారు. ఈ క్రమంలో మాయావతి కూటిమి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఫలితాల అనంతరం పార్టీ నాయకులతో కలిసి సమీక్ష నిర్వహించిన మాయావతి…కూటమి ఓటమిపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థులకు యాదవుల ఓట్లు ఎక్కువగా పడలేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. యాదవుల ఓట్లను ఆకర్షించడంలో అఖిలేశ్‌ దారుణంగా విఫలమయ్యారని.. ఆఖరికి ఆయన భార్య డింపుల్‌ యాదవ్‌ను కూడా గెలిపించుకోలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాయవతి.

కూటమి వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని మాయావతి పార్టీ నాయకుల ముందు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కూటమిలో చేరకపోతే.. బీఎస్పీ మరో 5 సీట్లు ఎక్కువ గెలుచుకునేదని ఆమె అన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రానున్న ఎమ్మెల్యే ఉపఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Read MoreRead Less
Next Story