టీడీపీలో కలకలం.. చంద్రబాబుకు ఆ ఎంపీ షాక్ ఇస్తారా?

టీడీపీలో కలకలం.. చంద్రబాబుకు ఆ ఎంపీ షాక్ ఇస్తారా?

విజయవాడ ఎంపీ కేశినేని నాని.. పార్టీ వ్యవహారాల్లో ఎందుకు అంటీముట్టనట్టు ఉంటున్నారు. కావాలనే ఆయన కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా.. ఇప్పుడివే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆయన పార్లమెంటరీ పార్టీ విప్ పదవి తిరస్కరించారు. తన బదులు సమర్థుడైన మరొకరిని నియమించాలని అధినేత చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. విప్ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూనే.. తాను అంత పెద్ద పదవి చేపట్టడానికి అనర్హుడిని అని భావిస్తున్నానంటూ కామెంట్ చేశారు. దీని అర్థం ఏంటి.. ఆయన ఎందుకిలా చేశారన్నది పార్టీలో చర్చనీయాంశమైంది. విజయవాడ ప్రజలు తనను ఎంపీగా గెలిపించారని, వారి ఆశీస్సులు తనకు ఉన్నాయని నాని అన్నారు. పార్టీ ఇచ్చే విప్ పదవి కంటే ప్రజలకు సేవ చేయడం ఎక్కువ తృప్తి ఇస్తుందని చెప్పుకొచ్చారు. ఇది ఇప్పుడు TDPలో కలకలం రేపుతోంది.

అసలే ఓటమి భారంతో ఉన్న పార్టీలో ఈ తరహా పరిణామాలు ఎటు దారి తీస్తాయోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. పార్టీ అధినేత చంద్రబాబుకు నాని షాక్ ఇస్తారని.. ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. తాను బీజేపీలో చేరతానంటూ వస్తున్న వార్తలను నాని కొట్టిపడేస్తున్నా.. తాజా పరిణామాలతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ నుంచి ముగ్గురు ఎంపీలుగా గెలిచారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించిన చంద్రబాబు.. లోక్‌సభ నాయకుడిగా రామ్మోహన్ నాయుడుకు అవకాశం ఇచ్చారు. కేశినేని నానికి విప్ పదవి ఇచ్చారు. ఐతే.. తనకు సరైన గుర్తింపు దక్కలేదన్న కారణంగానే నాని విప్ పదవి తిరస్కరించినట్టు తెలుస్తోంది. విజయవాడ నుంచి రెండోసారి ఎంపీగా గెలిచిన ఆయన.. ఈ మధ్యే బీజేపీ ముఖ్యనేతను కలిసినట్టు ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారం ఖండిస్తున్నారు నాని.. ప్రస్తుతానికి వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా.. ఆయన మదిలో ఏముంది అన్నది అంతు చిక్కడం లేదు.

Tags

Read MoreRead Less
Next Story