ఆంధ్రప్రదేశ్ రైతులకు ఏటా 12 వేల 500 రూపాయల పెట్టుబడి సాయం

ఆంధ్రప్రదేశ్ రైతులకు ఏటా 12 వేల 500 రూపాయల పెట్టుబడి సాయం

రాష్ట్రంలోని వివిధ విభాగాల పనితీరును సమీక్షిస్తూ ప్రభుత్వ ప్రాథమ్యాలతో అధికారులకు దిశానిర్దేశం చేస్తున్న సీఎం జగన్... గురువారం వ్యవసాయం, సాగు ప్రాజెక్టులపై ఆరా తీశారు. ముందుగా వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం.. తమ ప్రభుత్వం రైతాంగానికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించాలని సూచించారు. ఎన్నికల హామీల్లో భాగమైన రైతు భరోసా పథకాన్ని అక్టోబర్ 15 నుంచి అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేసి రైతు భరోసా ద్వారా నాలుగు దశల్లో 12 వేల 500 రూపాయల పెట్టుబడి సాయం అందించనుంది ప్రభుత్వం.

రైతులను చావు దెబ్బ తీస్తున్న నకిలీ విత్తనాల చలామణిపై జగన్ సీరియస్ అయ్యారు. నకిలీ విత్తనాలను మార్కెట్ చేసేవాళ్లను జైలుకు పంపేందుకు కూడా వెనకాడొద్దని సూచించారు. అవసరమైతే అసెంబ్లీలో చర్చించి.. విత్తనచట్టంలో మార్పులు తీసుకొస్తామన్నారు. ఇక గ్రామ సచివాలయాలు వ్యవసాయ రంగం అవసరాలకు ప్రధాన కేంద్రం చేసే ఆలోచనలో తమ ప్రభుత్వం ఉందని.. రాష్ట్రంలో వినియోగించే విత్తనాలు, ఎరువులు, మందుల పంపిణీ గ్రామ సచివాలయాల ద్వారా జరిగేలా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించించారు. ప్రభుత్వం సేవలు అందించిందీ అంటే దానికో ప్రత్యేక బ్రాండ్ పడాలని, రైతులకు ప్రభుత్వ సేవలపై విశ్వసనీయత పెంచాలని సూచించారు.

ఆ తర్వాత ఇరిగేషన్ శాఖపై రెండో సారి సమీక్షించిన ఏపీ సీఎం.. సాగు, తాగు నీటి ప్రాజెక్టులతో అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టులకు జరిగిన కేటాయింపులు, విడుదలైన నిధులు, ప్రాజెక్టు పనుల పురోగతి వివరాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాగు నీటి ప్రాజెక్టులపై థర్డ్‌పార్టీ విచారణ చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అవసరమైతే కొన్ని ప్రాజెక్టులలో రీటెండరింగ్‌కు వెళ్లాలని సీఎం జగన్‌ సూచించారు. గత వారమే ఇరిగేషన్ అధికారులతో సీఎం సమావేశం అయ్యారు. అయితే..ప్రాజెక్టుల వివరాలపై సమగ్ర వివరాలతో రావాలని జగన్ ఆదేశించటంతో ఇప్పుడు మరోసారి సమీక్ష నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story