తాజా వార్తలు

తెలంగాణ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు

తెలంగాణ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు
X

తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్‌ సీల్పీ విలీనాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతలు ధర్నాకు దిగడం.. వారిని పోలీసులు అడ్డుకోవడంతో హై టెన్షన్‌ నెలకొంది. సీఎల్పీని టిఆర్‌ఎస్‌ విలీనం చేసే ప్రక్రియను నిరసిస్తూ నోటికి నల్లరిబ్బన్‌ కట్టుకొని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి , షబ్బీర్‌ అలీ, అద్దంకి దయాకర్, విహెచ్, అంజన్‌కుమార్‌ యాదవ్‌, తదితరులు గాంధీ విగ్రహం ఎదుట నేలపై కూర్చొని నిరసనకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో ప్రభుత్వం తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు.

కాంగ్రెస్‌ నేతలకు తోడు.. భారీగా కార్యకర్తలు చేరుకుంటుండడంతో పరిస్తితి ఇంకాస్త ఉద్రిక్తంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఉత్తమ్,భట్టి,శ్రీధర్‌బాబు, అద్దంకి దాయకర్, పొన్నాల సహా ఇతర నేతలను అరెస్ట్ చేశారు. అసెంబ్లీ అన్ని గేట్లకు తాళాలు వేసిన పోలీసులు.. గేట్-1 నుంచి ఉత్తమ్,భట్టి,శ్రీధర్‌బాబును అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

తెలంగాణ స్పీకర్ తమకు కనబడటం లేదని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయడం లేదన్నారు. స్పీకర్ ఎక్కడ ఉన్నారో కనుకుని చెప్పాలని అసెంబ్లీ కార్యదర్శికి ఫోన్ చేసి ఉత్తమ్‌ కోరారు. కాంగ్రెస్‌ వీడిన 12 మంది ఎమ్మెల్యేలపై అర్హత వేటు వేయాలని కోరారు. సిఎల్పీని విలీనం చేసే హక్కు స్పీకర్‌కు లేదన్నారు.

అంతకుముందు టీఆర్ఎస్‌లో సీఎల్పీని విలీనం చేయాలంటూ కాంగ్రెస్‌ను వీడిన 12మంది ఎమ్మెల్యేలు తెలంగాణ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. 12 మంది ఎమ్మెల్యేలు తమ సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని స్పీకర్‌కు సమర్పించారు. సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, ఆత్రం సక్కు, హరిప్రియా, జాజుల సురేందర్‌, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, సుధీర్‌ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, రేగ కాంతారావు, పైలట్‌ రోహిత్‌ రెడ్డి, కందాల ఉపేందర్‌ రెడ్డి, చిరుమర్తి లింగయ్య ఉన్నారు. తామంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, తమ నిర్ణయానికి ప్రజల మద్దతు కూడా ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగానే సీఎల్పీ విలీనం కోరుతున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు.

గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరంతా అధికారికంగా టీఆర్‌ఎస్‌లో చేరనప్పటికీ వారు కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధాలు కొనసాగించడం లేదు. ఇక ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, శ్రీధర్‌ బాబు, సీతక్క, పోడెం వీరయ్య, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మాత్రమే పార్టీలో ఉన్నారు.

ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఎంపీగా గెలవడంతో హుజుర్‌నగర్‌ శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో 6 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. పోడెం వీరయ్య కూడా పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. ఇక సాంకేతికంగా 12మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడితే... అసెంబ్లీలో సీఎల్పీ మనుగడ కష్టమే. మరోవైపు తాజా పరిణమాలు కాంగ్రెస్ సీనియర్‌ నేతలకు మింగుడపడటం లేదు.

Next Story

RELATED STORIES