ఆ జిల్లాలో మంత్రి పదవులు ఎవరికి?

టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే జిల్లాల్లో శ్రీకాకుళం ఒకటి. పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ప్రజలు టీడీపీకి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు. అలాంటిది మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్‌ గాలి వీచి... 10 అసెంబ్లీ స్థానాలున్న సిక్కోలులో 8 స్థానాల్లో వైసీపీ విజయభావుటా ఎగరవేసింది. కేవలం టెక్కలి, ఇచ్చాపురం స్ధానాల్లో మాత్రమే టీడీపీ జెండా ఎగురవేయగలిగింది.

జిల్లాలో వైసీపీ నుంచి ఎనిమిది మంది విజయం సాధించారు. అయితే అసలు కథ మొదలయ్యింది. జగన్ కేబినెట్‌లో మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయో అన్న టెన్షన్ ఇపుడు జిల్లా వైసీపీ నేతలను వేధిస్తోంది. ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంలు సీనియర్లుగా ఉన్నారు. ఈ ఇరువురికి జగన్ మంత్రి పదవులు ఇస్తారంటూ మొదట్లో జోరుగా ప్రచారం సాగింది. సీనియారిటీ దృష్ట్యా ఈ ఇద్దరు నేతలు కేబినెట్‌లో ఉంటే ..పార్టీని నడిపించటంతో పాటు , పాలనా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయన్న భావనలో జగన్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈసారి ధర్మాన ప్రసాదరావు సోదరుడు నరసన్నపేట ఎమ్మెల్యే కృష్ణదాసుకు జగన్ కేబినెట్‌లో బెర్తు ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్నప్పటికీ కృష్ణదాసు మాత్రం అప్పట్లో వైసీపీలో చేరాడు. జగన్‌కు వెన్నంటే ఉంటూ అత్యంత విశ్వాస పాత్రుడిగా పేరు సంపాధించారు. దీంతో జగన్ కృష్ణదాసు వైపే మొగ్గుచూపుతారనే టాక్ నడుస్తోందట.

ఇక పాతపట్నం ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్డి శాంతి కూడా మంత్రి పదవి కోసం జోరుగా లాబీయింగ్ చేస్తున్నారు. కష్ట కాలంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా పని చేసి క్యాడర్ ను ముందుకు నడిపించిన శాంతి ఇపుడు మంత్రి పదవిని ఆశిస్తున్నట్టు సమాచారం. శాంతి మొదటి సారి ఎమ్మెల్యే కావటంతో సీనియర్లు ఆమెకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటారనే అనుమానాలు వ్యక్తమౌతున్నట్లు తెలుస్తోంది. .

రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పాలకొండ నుంచి విశ్వసరాయి కళావతిలు రెండవ సారి వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరు మొదటి నుంచీ పార్టీకి విధేయులుగా ఉంటూ వస్తున్నారు. టిడిపి నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఈ ఇరువురు నేతలూ పార్టీలో కొనసాగారన్న భావన..... అధినేత మనసులో ఉంది.

గెలిచామన్న ఆనందంలో ఉన్న వైసీపీ నేతలు.... ఇప్పుడు మంత్రి పదవులు దక్కుతాయో లేదో అన్న ఆందోళనలో ఉన్నారట. సిక్కోలు వైసీపీ నేతల్లో ఎవరికి మంత్రి పదవులు వరిస్తాయో మరి.

Tags

Read MoreRead Less
Next Story