Top

కీలకమైన ఆ మూడు బిల్లులపై సంతకం చేసిన సీఎం జగన్

కీలకమైన ఆ మూడు బిల్లులపై సంతకం చేసిన సీఎం జగన్
X

ఎన్నికల ఫలితాల్లో సునామీ సృష్టించిన జగన్‌.. సీఎంగాను తనదైన మార్కు చూపిస్తున్నారు. ఇప్పటికే పలు శాఖల అధికారులతో రివ్యూలు నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్న ఆయన.. ఇప్పుడు అమరావతి సచివాలయం నుంచి కార్యకలాపాలను ప్రారంభించారు. ఆ వెంటనే కీలకమైన మూడు బిల్లులపై సంతకం చేశారు. మరోవైపు ఏపీ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు.

ఏపీ సీఎం జగన్‌.. మంచి ముహూర్తం చూసుకుని అమరావతి సచివాలయం నుంచి కార్యకలాపాలను ప్రారంభించారు. ఉదయం 8 గంటల 39 నిమిషాలకు తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మూడు ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆశ వర్కర్ల జీతాలు 10 వేల రూపాయలకు పెంచే ఫైలుపై తొలి సంతకం చేశారు. తరువాత ఎక్స్‌ప్రెస్‌వేకి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరుతూ రెండో సంతకం చేశారు. జర్నలిస్టుల హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రెన్యువల్ ఫైలుపై మూడో సంతకం చేశారు జగన్.

తొలిసారి సీఎంగా సచివాలయంలో అడుగుపెట్టిన జగన్‌కు ఉద్యోగులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు వరాలు ప్రకటించారు సీఎం జగన్. 27 శాతం ఐఆర్ ప్రకటించారు. మేనిఫెస్టోలో ఉద్యోగస్తులకు చెప్పిన అన్ని అంశాలను పూర్తి చేస్తానని భరోసా కల్పించారు. సీపీఎస్‌ను కూడా రద్దు చేస్తామన్నారు. తొలి కేబినెట్‌లోనే వీటిపై చర్చించి ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై కమిటినీ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వంలో కాంట్రాక్టు పద్దతిలో పని చేస్తున్న వారికి సబంధించి వారి అర్హత, అనుభవం ఆధారంగా వీలైనంత ఎక్కువమంది ప్రభుత్వంలోకి తీసుకుంటామన్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాలు పెంచుతామన్నారు. ఉద్యోగులంతా ఇళ్ల స్థలాల గురించి భయపడాల్సింది ఏమీ లేదన్నారు. ప్రతి విభాగంలో ప్రతి సెక్రటరీ, హెచ్‌వోడీ దగ్గర వైసీపీ మేనిఫెస్టో ఉండాలని అందరికీ చెప్పానన్నారు. గతంలో చంద్రబాబుకు సన్నిహితంగా ఉద్యోగులపై తనకు ఎలాంటి కోపం లేదన్నారు. ఆ వెంటనే అన్ని శాఖల HODలతో సమావేశమై సమీక్ష చేశారు. మరోవైపు జగన్‌ రాక సందర్భంగా సచివాలయంలో భారీ ఏర్పాట్లు చేశారు. సీఎంను స్వాగతిస్తూ సచివాలయ ప్రాంగణంలో భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. సచివాలయంతో పాటు సీఎం చాంబర్‌ను ప్రత్యేకంగా అలంకరించారు.

Next Story

RELATED STORIES