ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ గా కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి నియమితులయ్యారు. అదే జిల్లాకు చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విశాఖ జిల్లా మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు లను విప్ లుగా నియమించారు సీఎం జగన్. నాలుగుసార్లు రాయచోటి ఎమ్మెల్యే గా గెలిచిన శ్రీకాంత్ రెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితులు. రాజకీయాలలోకి రాకముందు శ్రీకాంత్ రెడ్డి అమెరికా తెలుగు అసోసియేషన్‌లో క్రియాశీలక సభ్యుడిగా వ్యవహరించారు.
2004 ఎన్నికలలో అత్యంత కరవు ప్రాంతమైన అప్పటి లక్కిరెడ్డి పల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో తన తండ్రి తరపున శ్రీకాంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. అనూహ్యంగా 2009 లో రాయచూటి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానంతో విభేదించిన జగన్ ఆ పార్టీ నుంచి బయటికి రాగానే.. శ్రీకాంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. ఈ దఫా ఆయనకు మంత్రిపదవి దక్కుతుందని అందరూ భావించారు కానీ సామాజిక సమీకరణాలదృష్ట్యా మంత్రి పదవి రాలేదు. దీంతో చీఫ్ విప్ పదవిని కట్టబెట్టారు జగన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com