తండ్రి వైఎస్‌ బాటలోనే ఏపీ సీఎం జగన్‌..

తండ్రి వైఎస్‌ బాటలోనే ఏపీ సీఎం జగన్‌ నడిచారు.. హోం శాఖను మహిళకు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. నవ్యాంధ్ర ప్రదేశ్‌లో కొత్త కేబినెట్‌ కొలువుదీరగా.. హోంమంత్రిగా మేకతోటి సుచరితకు జగన్‌ అవకాశం ఇచ్చారు. మరోవైపు ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీరి ఎంపికలోనూ వివిధ సామాజిక వర్గాలకు చోటు కల్పించి తన మార్కు చూపించారు.

ఆంధ్రప్రదేశ్‌ నూతన మంత్రివర్గం కొలువుదీరింది. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పాలనలో తనదైన మార్కు చూపిస్తున్న జగన్‌.. కేబినెట్‌ కూర్పులోనూ అదే శైలి కొనసాగించారు. తండ్రి బాటలో నడుస్తూ హోంమంత్రి పదవి మహిళకు కేటాయించారు. మేకతోటి సుచరితను హోం శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పారు.

జగన్‌ తన కేబినెట్‌లో ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించారు. బీసీకి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ కోటాలో మంత్రివర్గంలోకి వచ్చిన పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఉపముఖ్యమంత్రిగా ఆయన రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖలను పర్యవేక్షించనున్నారు. ఏలూరు నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాపు సామాజిక వర్గానికి చెందిన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌కు ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలను కూడా ఆళ్లనాని పర్యవేక్షించనున్నారు.

కడప నుంచి మొదటిసారిగా గెలిచిన అంజాద్ బాషాకు డిప్యూటీ సీఎం పదవితో పాటు మైనారిటీ సంక్షేమశాఖను అప్పగించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నుంచి గెలిచిన నారాయణ స్వామిని ఉపముఖ్యమంత్రిగా నియమించటంతో పాటు ఎక్సైజు వాణిజ్య పన్నుల శాఖను కూడా అప్పగించారు. విజయనగరం జిల్లా కురుపాం నుంచి గెలుపొందిన పాముల పుష్ప శ్రీవాణికీ డిప్యూటీ సీఎం పదవి దక్కింది. ఆమె గిరిజన సంక్షేమశాఖ బాధ్యతలు అప్పగించారు. పార్టీ పెట్టినప్పటి నుంచి వెన్నంటే ఉన్న ధర్మాన కృష్ణదాస్ కు రహదారులు భవనాల మంత్రిత్వశాఖను కేటాయించారు. పార్టీలో సీనియర్ నేత, బీసీ సామాజిక వర్గానికి చెందిన బొత్సకు పురపాలక శాఖ కేటాయించారు. జగన్‌ నేతృత్వంలో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామన్నారు మంత్రులు.

అవంతి శ్రీనివాస్‌కు పర్యాటక, సాంస్కృతికం, యువజన సంక్షేమశాఖను కేటాయించారు. కాకినాడ రూరల్ నుంచి గెలుపొందిన కురసాల కన్నబాబుకు కీలకమైన వ్యవసాయం సహకారశాఖలను అప్పగించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన పినిపే విశ్వరూప్‌కు సాంఘిక సంక్షేమం శాఖను కేటాయించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం నుంచి గెలుపొంది క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన చెరుకువాడ శ్రీరంగనాధ రాజుకు గృహనిర్మాణ శాఖను ఇచ్చారు. కొవ్వూరు నుంచి ఎన్నికై దళిత సామాజిక వర్గానికి చెందిన తానేటి వనితకు స్త్రీ శిశు సంక్షేమశాఖను కేటాయించారు. కృష్ణా జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు సంపాదించిన కొడాలి నానికి పౌరసరఫరాల శాఖను కేటాయించారు.

మచిలీపట్నం నుంచి కాపుసామాజిక వర్గానికి చెందిన పేర్నినానిని రవాణా, సమాచార పౌరసంబధాల శాఖను ఇచ్చారు. విజయవాడ పశ్చిమం నుంచి గెలుపొంది ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్‌కు దేవాదాయశాఖను కేటాయించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన మేకతోటి సుచరితకు హోం, ప్రకృతి విపత్తుల నిర్వహణను అప్పగించారు. అనూహ్యంగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత మోపిదేవి వెంకట రమణకు మత్య్స పశుసంవర్ధక శాఖను కేటాయించారు. ప్రకాశం జిల్లా నుంచి ఇద్దరికి మంత్రిపదవులు దక్కాయి. బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇంధన, అటవీ, పర్యావరణ శాఖలను కేటాయించారు. మాజీ ఐఆర్ఎస్ అధికారి, పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఆదిమూలపు సురేష్‌కు కీలకమైన విద్యాశాఖను అప్పగించారు. యాదవ సామాజిక వర్గం నుంచి మంత్రి వర్గంలో చోటు సంపాదించిన అనిల్ కుమార్ యాదవ్ కు జలవనరుల శాఖను కేటాయించారు. మేకపాటి గౌతమ్ రెడ్డికి ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖను అప్పగించారు. సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పంచాయితీరాజ్ గనుల శాఖను అప్పగించారు. అత్యంత కీలకమైన ఆర్ధిక శాఖను అత్యంత విశ్వాసపాత్రుడైన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అప్పగించారు. దీంతో పాటు శాసనసభా వ్యవహారాల శాఖను కూడా ఆయనకు అప్పగించారు. గుమ్మనూరు జయరామ్ కు కార్మిక సంక్షేమం, శంకర నారాయణకు బీసీ సంక్షేమ శాఖలను కేటాయించారు.

Tags

Read MoreRead Less
Next Story