కిషన్ రెడ్డికి ఘనస్వాగతం

కిషన్ రెడ్డికి ఘనస్వాగతం

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి కిషన్‌రెడ్డి తన స్వగ్రామం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో పర్యటించారు. రామాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్‌ ప్రజలు బాణా సంచాలతో, డప్పులతో కిషన్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు. సతీసమేతంగా రామాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం తన తల్లి ఆండాళమ్మ సమాధిని సందర్శించి నివాళులర్పించారు.

తిమ్మాపూర్‌ నుంచి తిరిగి వచ్చిన కిషన్‌రెడ్డి.. మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను కలిశారు. హైదరాబాద్‌లోని రాంనగర్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయనతో పాటు కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కూడా వెళ్లారు. ఇద్దర్ని సాదరంగా ఆహ్వానించి శాలువా కప్పి స్వీట్లు తినిపించారు దత్తాత్రేయ.

ఇక నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు కిషన్‌రెడ్డి. శంకర్ మఠ్‌ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారి హైదరాబాద్‌ వచ్చిన కిషన్‌ రెడ్డికి అభిమానులు, కార్యకర్తలు అభినందనలతో ముంచెత్తారు. 2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని కిషన్ రెడ్డి పిలుపు నిచ్చారు.

హైదరాబాద్‌లో కార్యక్రమాలు ముగించుకొని తిరుమల బయల్దేరారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. ప్రధాని మోదీ తిరుమల వస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రిగా స్వాగతం పలికేందుకు కిషన్‌రెడ్డి తిరుమల వెళ్లారు. కేంద్ర మంత్రి హోదాలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కిషన్‌రెడ్డికి బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. బీజేపీ ఘన విజయాన్ని సాధించినందున శ్రీవారికి మొక్కులు తీర్చుకునేందుకే మోదీ తిరుమలకు వస్తున్నారని తెలిపారు. అద్భుతమైన పరిపాలన అందించే శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని మోదీ కోరుకోనున్నట్లు తెలిపారు కిషన్‌రెడ్డి. ప్రధానమంత్రి పర్యటన పూర్తయిన తర్వాత తిరిగి హైదరాబాద్‌ రానున్నారు కిషన్‌రెడ్డి. సోమవారం నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని మంగళవారం తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story