ఏపీ భ‌వ‌నాల‌ను తీసుకునే ప‌నిలో పడిన తెలంగాణ స‌ర్కారు

ఏపీ భ‌వ‌నాల‌ను తీసుకునే ప‌నిలో పడిన తెలంగాణ స‌ర్కారు

AP ఆధీనంలోని భ‌వ‌నాల‌ను తెలంగాణ‌కు తిరిగివ్వాల‌ని వారం క్రితం గవర్నర్ ఉత్వర్వులు జారీ చేశారు. దీంతో భ‌వ‌నాల‌న్నిటిని తీసుకునే ప‌నిలో ప‌డింది తెలంగాణ స‌ర్కారు. స‌చివాల‌యంలో తెలంగాణ సీఎస్ జోషి తో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశమయ్యారు. ఏపీ తరపున ప్రేమ్‌చంద్రారెడ్డి, తెలంగాణ తరపున రామకృష్ణారావు హాజరు అయ్యారు. గవర్నర్ ఉత్వర్వుల మేరకు ఏపీ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడంపై చర్చించారు. ఏపి ఆధీనంలో ఉన్న భ‌వ‌నాల అప్పగింత వారం రోజుల్లో పూర్తి చేయాల‌ని అధికారులు ప్లాన్ చేశారు. సచివాలయ భవనాలను తెలంగాణ జీఏడీకి అప్పగించాల‌ని స‌మావేశంలో నిర్ణయించారు.

జీఏడి అధికారుల చేతికి రాగానే ఆ భ‌వ‌నాల మ‌ర‌మ్మత్తులు చేస్తారు. అంతా సిద్ధమైన తర్వాత ప్రస్తుతం తెలంగాణ ప‌రిపాల‌న సాగుతున్న ఏ,బి,సి,డి బ్లాక్ లో ఉన్న అన్ని శాఖ‌ల ఆఫీసులు, మంత్రుల పేషీలు, సీఎంవో సహా కొత్తగా తీసుకున్న బ్లాక్ లోకి త‌ర‌లిస్తారు. షిప్టింగ్ ప్రక్రియ అంతా ప‌ది రోజుల్లో పూర్తయ్యేలా చూస్తున్నారు.

కొత్త స‌చివాల‌య నిర్మాణానికి సంబందించి గతంలో బైస‌న్ పోలో గ్రౌండ్ పై ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. అది రక్షణశాఖ ఆధీనంలో ఉండ‌టంతో కేంద్రం ఎటూ తేలడంలేదు. దీంతో న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న ప్రస్తుత సచివాలయ స్థానంలోనే కొత్త నిర్మాణం చేపట్టడం మేలని ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. ఏపీ భవనాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాగానే రెండు ద‌శ‌ల్లో కొత్త స‌చివాల‌య నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు. ముందుగా వాస్తుకు అనుకూలంగా లేని ఏ,బి,సి,డి బ్లాకుల‌ను కూల్చి నిర్మాణ ప‌నులు మొద‌లు పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఆ వెంట‌నే రెండో ద‌శ‌లో పూర్తి స్థాయిలో స‌చివాల‌య నిర్మాణం కంప్లీట్ అయ్యేలా డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు సిద్ధమైనట్టు సమాచారం.

స‌చివాల‌య నిర్మాణ DPR కు సీఎం కేసిఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే శంకుస్థాపన ముహుర్తం ఖ‌రారు కానుంది. కేసీఆర్ మొద‌టసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కొత్త స‌చివాల‌యం నిర్మాణం చేప‌ట్టాల‌ని భావించినా.. అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. కానీ ఏపి కేటాయించిన బిల్డింగ్ త‌మ ఆధీనంలోకి రావ‌డంతో ప్రస్తుత సచివాలయ స్థానంలోనే కొత్త భవనానికి పునాదిరాయి పడనుంది.

Tags

Read MoreRead Less
Next Story