Top

సీఎం జగన్ ఫోన్ చేస్తే తప్ప ప్రస్తుతానికి చేసేదేమీ లేదు..

సీఎం జగన్ ఫోన్ చేస్తే తప్ప ప్రస్తుతానికి చేసేదేమీ లేదు..
X

ఏపీలో YCP ప్రభుత్వం ఏర్పడటం..! సీఎం పీఠంపై జగన్ను చూడడం...! ఇది YS వీరాభిమానులు, YCP సీనియర్ నేతల కల. ఎన్నాళ్లో వేచిన ఆ ఉదయం రానే వచ్చింది. జగన్ కూడా ఊహించని రేంజ్ లో... వార్ వన్ సైడ్ అయింది. ఏపీ తీరంలో ఫ్యాను గాలి సునామీకి మిగతా పార్టీల అడ్రస్ గల్లంతైంది. వైసీపీ ఏకంగా 151 సీట్లు గెల్చుకోవడంతో అంతా సంతోషంలో మునిగిపోయారు. అయితే కేబినెట్ కూర్పు మాత్రం ఎవరూ ఊహించని రేంజ్ లో ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ టీమ్ లో కొన్నిపేర్లు గల్లంతయ్యాయి. చాలా మంది సీనియర్లకు ఇది షాక్ కిందే లెక్క. కచ్చితంగా మంత్రిపదవి వస్తుందనుకున్న వారికి కూడా ఆశాభంగం తప్పలేదు.!

మంత్రివర్గ కూర్పును చూస్తే జగన్ చాలా కసరత్తే చేశారన్నది సుస్పష్టం. ఎన్నో సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని మంత్రులను ఎంపిక చేశారు. పార్టీకి అందించిన సేవలతోపాటు...జిల్లాలు, ప్రాంతాలు, కులాల వారీ లెక్కలు బేరీజు వేసుకొని టీం ఎంపికచేసుకున్నారు జగన్. 25 మంది మంత్రుల్లో 19 మంది కొత్తవారే. ఈ కూర్పు కారణంగా కొంతమంది సీనియర్లకు ఉద్వాసన తప్పలేదు. దాదాపు 50 మంది వరకు నేతలు పదవుల్ని ఆశించారు. కానీ 25 మందిని మాత్రమే తీసుకునే అవకాశం ఉండటంతో మిగతావారికి నిరాశే మిగిలింది. పైకి చెప్పుకునే పరిస్థితి లేకపోవడంతో.. పదవులు ఆశించి భంగపడ్డ నేతలంతా తెగ బాధపడిపోతున్నారట. ఒకరికొకరు ఫోన్లు చేసుకొని పరామర్శించుకుంటున్నట్లు సమాచారం..

ధర్మాన కుటుంబం ప్రస్తావన లేకుండా శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను చెప్పుకోలేం. ముఖ్యంగా ఇక్కడి రాజకీయాలపై ధర్మాన ప్రసాదరావుది చెరగని ముద్ర. చాలా సీనియర్ నేత. మంచి విషయపరిజ్ఞానం ఆయన సొంతం. అంతేకాదు సౌమ్యుడిగా, అజాత శత్రువుగా పేరుంది. గతంలో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్‌ కుమార్ రెడ్డి కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు. వైఎస్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు ఉంది. జగన్ కూడా ఆయనకు అదే రీతిలో ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక, పార్టీ విధివిధానాల రూపకల్పన వంటి కీలక బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు..ఒకేసారి 175 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు జగన్. ఆ లిస్టును కూడా జగన్ పక్కన కూర్చొని స్వయంగా ధర్మాన ప్రసాదరావే ప్రకటించారు. అందుకే జగన్ టీమ్ లో ఈయనకు ప్లేస్ పక్కా అని అందరూ డిసైడ్ అయ్యారు. ప్రసాద్ రావు కంటే ముందే కృష్ణదాస్ పార్టీలోచేరారు. అయినా కూడా సీనియార్టిని అనుభవాన్ని జిల్లా రాజకీయాల్లో పాలనా బాధ్యతలు అన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మాన ప్రసాద్ రావుకే ఇస్తారనుకున్నారు. అది జరగలేదు. కానీ ఊహించని విధంగా ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. ధర్మాన ప్రసాదరావు కూడా ఇలా జరుగుతుందని ఊహించి ఉండరు. జగన్ సీనియార్టీకి ప్రాధాన్యం ఇస్తేనే బాగుండేదన్న వ్యాఖ్యలు ఆ జిల్లాలో వినిపిస్తున్నాయి.

విజయనగరం జిల్లా నుంచి ఊహించినట్లుగానే బొత్సకు కేబినెట్ లో చోటుదక్కింది. అయితే వైశ్య సామాజికవర్గం నుంచి కోలగట్ల వీరభద్రస్వామికి కూడా బెర్త్ కన్ఫాం అన్నవార్తలు వినిపించాయి. వైశ్య సామాజిక వర్గ కోటాలో వెల్లంపల్లి శ్రీనివాస్‌కు ఛాన్స్ ఇచ్చారు. వైసీపీ విజయనగరం నుంచి బరిలోకి దిగిన కొలగట్ల.. అశోక్ గజపతిరాజు కుమార్తె అధితిని ఓడించారు. జిల్లాలో పూసపాటి వంశీయులను ఓడించిన నాయకుడిగా రికార్డు సృష్టించారు. ఇలాంటి కీలక నేతకు కూడా కేబినెట్ బెర్త్ దక్కకపోవడంపై ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ జిల్లా నుంచి మంత్రిపదవి ఆశించి భంగపడిన మరో నేత గుడివాడ అమరనాథ్‌. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. పాదయాత్రలో ఆయన వెన్నంటి నిలిచిన వ్యక్తి. యువ నాయకులు. గతంతో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తాజా ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఘన విజయం సాధించారు. జగన్‌ టీంలో విశాఖకు రెండు బెర్తులు కన్ఫామ్‌అని అందులో ఒకటి..కాపు సామాజిక వర్గానికి చెందిన అమరనాథ్‌కే దక్కుతుందని అందరూ అంచనా వేశారు. కానీ వాటన్నింటిని పటా పంచలు చేశారు. ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్‌ చేసి.... భీమిలి నుంచి గెలుపొందిన అవంతి శ్రీనివాస్‌కు కేబినెట్‌లో చోటు కల్పించారు‌. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారిని కాదని..నిన్నమొన్న వచ్చిన వారికి మంత్రి పదవి ఇవ్వడంతో అమరనాథ్ అనుచరులు నిరాశలో మునిగిపోయారు..

ఉభయగోదావరి జిల్లాలు మొదటి నుంచి టీడీపీకి కంచుకోటలు. అయితే ఈసారి వైసీపీకి మంచి రిజల్ట్స్ వచ్చాయి. అందుకే జగన్ గోదావరి జిల్లాలకు మొత్తం 6 మంత్రి పదవులు కేటాయించారు. అయితే నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు, భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌లకు నిరాశ తప్పలేదు. పార్టీ అవిర్భావం నుంచి జగన్‌కు చేదోడువాదోడుగా ఉన్న వ్యక్తి ప్రసాదరాజు. క్షత్రియ వర్గం నుంచి ప్రసాద్‌రాజుకు తప్పనిసరిగా కేబినెట్ లో చోటు దక్కుతుందని అంతా ఊహించారు. అయితే అనూహ్యంగా ఆయన స్థానంలో ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజును అదృష్టం వరించింది. అటు భీమవరం నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పై ఘన విజయం సాధించారు గ్రంథి శ్రీనివాస్‌. పవన్‌ ను ఓడిస్తే మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. దీంతో గ్రంథి బంపర్ ఛాన్స్ కొట్టినట్లేనని అనుకున్నారు. కానీ ఆయన్ను దురదృష్టం వెంటాడింది.

కృష్ణా జిల్లాలోనూ ఇదే పరిస్థితి. పార్థసారధికి మంత్రి పదవి ఖాయమనుకున్నారు. బీసీ సామాజిక వర్గం.. అందులో రాజధాని ప్రాంతంలో బలమైన బీసీ నాయకుడు ఉండాలని జగన్ భావిస్తారని అనుకున్నారు. అనూహ్యంగా ఆయనకు దక్కలేదు. చివరి నిమిషంలో విప్ గా ఇచ్చారు. సుధీర్ఘ కాలం మంత్రిగా పనిచేసిన పార్థసారధిని విప్ గా ఇవ్వడం ఆయనను అవమానించడమేనని ఆయన అనుచరులు ycp పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మంత్రివర్గంలో చోటు ఖాయం అనుకున్న మరో నేత సామినేని ఉదయభాను, జోగి రమేష్ కు ఆశాభంగం తప్పలేదు. జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా వ్యవహరిస్తూ పార్టీ గళాన్ని బలంగా వినిపించిన ఈ ఇద్దరికి అమాత్య యోగం ఖాయం అనుకున్నారు. జగ్గయ్య పేట నుంచి గెలిచిన సామినేని ఉదయభాను రేసులో ఉన్నారంటూ చివరిదాకా ప్రచారం జోరుగా జరిగింది. ఆయన అభిమానులైతే కాబోయే మంత్రివర్యులు అంటూ ఏకంగా ఫ్లెక్సీలు కట్టి సంతోషపడ్డారు. కానీ వారి ఆశలు అడియాసలే అయ్యాయి. పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్‌ది ఇంచుమించు ఇలాంటి పరిస్థితే. టీడీపీ నేతలకు కౌంటర్లు ఇవ్వడంలో జోగి ముందుండేవారు. ఈయనకు కేబినెట్ బెర్త్ ఖాయం అనుకున్నారు. కానీ జగన్ మరోలా ఆలోచించడంతో.. నిరాశ తప్పలేదు.

జగన్ టీమ్ లో పల్నాడు ప్రాతానికి స్థానం దక్కలేదు. నాలుగుసార్లు గెలుపొందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కేబినెట్ లోకి తీసుకోలేదు. జిల్లాలో పశ్చిమ ప్రాంతంగా ఉన్న సత్తెనపల్లి, పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా మంత్రిగిరి దక్కకపోవడంపై ప్రజల్లో కాస్త అసంతృప్తి కనిపిస్తోంది. ముఖ్యంగా సత్తెనపల్లి నుంచి గెలుపొందిన అంబటి రాంబాబుకు కీలకమైన పోర్ట్ ఫోలియో దక్కుతుందని జోరుగా ప్రచారం జరిగింది. ఆయన మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌పై గెలుపొందారు. జగన్ కు అత్యంత సన్నిహితుడు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. వాయిస్ ఆఫ్ వైసీపీగా పేరుపొందారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ వంటి నేతలపై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించేవారు. పదునైన మాటలతో ఎదురుదాడి చేసేవారు. జగన్ పై ఈగ కూడా వాలనిచ్చేవారు కాదు. YCP ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్ సీనియర్లు, మాజీ సీఎంలు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలపై విమర్శలు గుప్పించారు. అందుకే ఆయనకు కీలకశాఖ ఖాయం అనుకున్నారంతా.

వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీని అంటిపెట్టుకొనిఉన్న గుంటూరు జిల్లా నేతలకు భంగపాటు తప్పలేదు. సీనియర్ నేత మర్రి రాజశేఖర్.. చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యే టికెట్ను జగన్ నిరాకరించారు. అయితే ఆయన మద్ధతు లేందే రజనీ గెలవదని భావించి.. చిలకలూరిపేట సభలో రజని గెలిస్తే రాజశేఖర్ కు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో రజని గెలవడంతో మర్రికి మంత్రి పదవి ఖాయమని సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ ఆయనకు చోటు దక్కలేదు. వాస్తవానికి మర్రి కేవలం చిలకలూరిపేట నియోజకవర్గంలోనే కాదు... జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. 2019లో మర్రిని కాదని రజనీకి టికెట్ ఇచ్చిన జగన్.. మంత్రిపదవి ఇస్తానంటూ బుజ్జగించారు. కానీ ఆ మాటనూ నిలబెట్టుకోలేక పోయారు.

ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం మంగళగిరి. రాజధాని ప్రాంతమంతా విస్తరించిఉండటంతో ఇక్కడ గెలుపుని టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నారా లోకేశ్ ను బరిలోకి దింపింది. హోరాహోరీ పోరులో లోకేశ్‌పై గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి జగన్ కేబినెట్‌లో చోటు ఖాయమనుకున్నారు. పైగా గతంలో మంగళగిరిలో గెలిస్తే మంత్రి పదవి ఇస్తానంటూ ఎన్నికల ప్రచారంలో స్వయంగా జగనే చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వంపై ఎన్నో న్యాయ పోరాటాలు చేశారు. చెన్నైలో ఉన్న సదావర్తి భూముల వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు. ఇన్నీ చేసినా... తుది కూర్పులో రామకృష్ణా రెడ్డికి నిరాశే ఎదురైంది. ఈక్వేషన్స్ వల్లే రామకృష్ణారెడ్డికి ఛాన్స్ దక్కకున్నా... ఆళ్లకు పదవీ రాకపోవడంపై ఆయన ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.

ప్రకాశం జిల్లాలో అన్నా రాంబాబు పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. వైశ్యకమ్యూనిటీకి చెందిన నేత కావడంతో మంత్రి పదవి గ్యారంటీ అనుకున్నారు. జిల్లాలో ఉన్న రాజకీయ కారణాలు, సమీకరణాల్లో భాగంగా ఈయనకు మొండిచేయి చూపించారు జగన్. ఇక ఇదే జిల్లాలో మహీధర్‌ రెడ్డి గతంలో మంత్రిగా పనిచేశారు. ఈసారి ఆయన పేరు కూడా బలంగానే వినిపించింది. అయితే ఎన్నికల చివరి సమయంలో పార్టీలో చేరారన్న కారణంతో ఆయనకు ఛాన్స్ చేజారినట్లు తెలుస్తోంది.

ఇక నెల్లూరు జిల్లా అంటేనే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక్కడ పట్టుసాధించడం మామాలు విషయం కాదు. కానీ వైసీపీ నెల్లూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. అన్నిస్థానాలను గెల్చుకుంది. దీంతో సీనియర్ నేత కాకాణి గోవర్దన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయం అనుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా వైసీపీ నేతలను, శ్రేణులను ఏకం చేయడంలో ఈయనదే కీ రోల్ అని చెబుతారు. టీడీపీని తీవ్రంగా ప్రతిఘటించడమే కాదు...నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చారు. కానీ కేబినెట్ లో మాత్రం చోటు దక్కలేదు. ఇక ఇదే జిల్లా నుంచి మరోసీనియర్ నేత ఆనం రాంనారాయణరెడ్డికి అమాత్యయోగం ఖాయమన్నారు.. చాలా సీనియర్ నేత. వైఎస్ కు అత్యంత సన్నిహితులు. ఆయన కేబినెట్ లోనూ పనిచేశారు. గతంలో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అయితే జిల్లా నుంచి..గౌతం రెడ్డి, అనిల్‌ యాదవ్‌కు పదవులు ఇవ్వడంతో ఆనంకు ఛాన్స్ దక్కలేదు. కనీసం స్పీకర్ పదవి ఇచ్చి గౌరవిస్తారని అనుకున్నా అది కూడా జరగలేదు.

మంత్రివర్గంలో స్థానం ఆశించి భంగపడిన వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు ఫైర్ బ్రాండ్ రోజా . వైసీపీ మౌత్ పీస్ గా వ్యవహరించారు. జగన్‌కు అండగా నిలిచారు. తన విమర్శలతో అధికార టీడీపీని, బాబు, లోకేష్‌లను కడిగిపారేసింది. పైగా అసెంబ్లీలో అనర్హత వేటు పడిందన్న సానుభూతి కూడా ఉంది.జబర్దస్త్‌లో జడ్జ్ గా వ్యవహరించడంతో ఆమెకు ప్రజల్లో మంచి క్రేజ్ ఉంది. రెండోసారి నగరి శాసనసభ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. దీంతో మంత్రివర్గంలో ఛాన్స్ కన్ఫామ్ అనుకున్నారు. హోంమంత్రిగా బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం విపరీతంగా జరిగింది. అన్ని విధాలా సహకరించినా వ్యక్తిగతంగా విమర్శలు ఎదుర్కొన్నా.. జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న పదవి దక్కకపోవడంపై రోజా అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక వైఎస్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు భూమన కరుణాకర్ రెడ్డి జగన్‌కు అన్ని రకాలుగా అండగా నిలబడ్డారు. ఎన్నికలకు ముందు పార్టీకి గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసిన ముఖ్యుల్లో కరుణాకర్‌ రెడ్డి ఒకరు. 2024 ఎన్నికల్లో తాను పోటీ చేయనని తనకు మంత్రి పదవి వస్తుందని ఊహించారు. కానీ ఎన్నికలకు 6 నెలల ముందు నుంచే భుమానను పక్కన పెట్టారు. జగన్‌తో యాక్సెస్‌ కూడా కట్‌ అయింది. ఉన్నట్టుండి భూమనను ఎందుకు పక్కన పెట్టారన్నది తెలియడం లేదు. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ మరో నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఈగ వాలినా ఒంటి కాలి మీద లేచేవారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై ఎప్పటికప్పుడు నిప్పులు చెరుగుతూ వచ్చారు. పలుమార్లు అరెస్టు కూడా అయ్యారు. అయితే ఆయనకు గుడ్డిలో మెల్లలా... కార్పొరేషన్ ఛైర్మన్ పదవితోపాటు విప్ పోస్ట్ దక్కినా మంత్రి పదవి దక్కలేదన్న ఆవేదన ఆయన అభిమానుల్లో ఉంది.

అయితే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి జగన్ కుటుంబానికి సన్నిహితుడు. పైగా ఆయన కుమారుడు మిథున్ రెడ్డి జగన్ కు ఫ్రెండ్. అన్ని రకాలుగా ఆర్థికంగా YCPకి సహకరించారని పేరుంది. ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి ఇవ్వని... పరిస్థితి.

ఇక అనంతపురం జిల్లాలో మంత్రి పదవిని ఆశించారు సీనియర్ నేత అనంత వెంకట్రామిరెడ్డి. చాలా సీనియర్‌ పార్లమెంటేరియన్‌గా ఈయనకు పేరుంది. సాధారణంగా అనంత జిల్లాలో ఓ బీసీకి మంత్రి పదవి ఇచ్చినా.. రెడ్డి వర్గానికి కూడా ఇవ్వడం ఆనవాయితీ. ఇక్కడ బీసీ వర్గానికి చెందిన శంకర్‌ నారాయణకు కేబినెట్ లో చోటు కల్పించారు. మరి అనంతకు ఎందుకివ్వలేదో అంతు చిక్కడం లేదు. వెంకట్రామిరెడ్డికి ఖాయం అని ఎన్నికలు జరిగిన నాటి నుంచే అనుకున్నారు. మరి అనంతకు ఆమాత్య యోగం ఎందుకు దక్కలేదో ఆయన వర్గీయులకు అంతు చిక్కడం లేదు. కర్నూలు జిల్లాలో శిల్పా కుటుంబానికి కూడా మంత్రి పదవి దక్కలేదు. తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. అయితే, కర్నూలు జిల్లా నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కాదని మరొకరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేకపోవడంతో శిల్పా కుటుంబ సభ్యులను పక్కన పెట్టాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.

పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారు. అధికార టీడీపీకి ఎదురొడ్డి నిలిచారు. అరెస్టయ్యారు. జైళ్లకు వెళ్లారు. ఇంకా కేసుల్ని ఎదుర్కొంటున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఖాయమని భావించారు. శ్రమనుకోకుండా పనిచేశారు. ఇలా ఎన్నో ఆశలు పెట్టుకున్న చాలా మంది వైసీపీ సీనియర్లకు ఘోరమైన భంగపాటు తప్పలేదు. ఎక్కడో తేడా కొడుతున్నా.. లీకవుతున్న లిస్టులో తమ పేర్లు లేకున్నా ఆశగా ఎదురుచూశారు.. జగన్ నుంచి ఫోన్ వస్తుందిలే అని సర్దిచెప్పుకున్నారు. కానీ అనుకున్నదొకటయితే జరిగింది మరొకటి. మంత్రివర్గ లిస్టులో చాలా మంది సీనియర్ల పేర్లు గల్లంతయ్యాయి. ఒకేసారి 25 మంది పేర్లను ప్రకటించిన జగన్... కొన్ని విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరించారు. సీనియార్టీ అనే అంశాన్ని నిర్దయగా పక్కన పెట్టారు. కేవలం సామాజిక వర్గాలు, జిల్లాల్లో రాజకీయ కారణాలు, ప్రాంతాల వారిగా ఈక్వేషన్స్.. ఇలా అన్నిఅంశాలను పరిగణలోకి తీసుకోవడంతో చాలా మందికి నిరాశ తప్పలేదు...

సామాజిక మాధ్యమాలు, మీడియాలో అయితే కొందరి పేర్లపై ప్రముఖంగా ప్రచారం జరిగింది. ఇవి పార్టీ నుంచి వచ్చిన లీకులుగానే భావించి చాలా మంది సంబరాలు కూడా చేసుకున్నారు. ప్రమాణ స్వీకారం చేయగానే సంబరాలు జరుపుకునేలా... కొందరు MLAలు క్రాకర్లు సిద్ధం చేసుకున్నారు. తీరా విషయం తెలిసి డీలా పడిపోయారు. మరికొందరు mlaలది వింత పరిస్థితి. ఆ జిల్లాల అధికారులు ముందుగానే వచ్చి... కంగ్రాట్స్ చెప్పి వెళ్లారు.తీరా ప్రాక్టికాలిటీకి వచ్చే సరికి.. తేడా కొట్టడంతో కుమిలి కుమిలి పోతున్నారు. అమాత్య యోగం దక్కని వారు ఒకరికొకరు ఫోన్లు చేసుకుని పరామర్శించుకుంటున్నారు. ఓదార్చుకుంటున్నారు. ముందు మంత్రి పదవి ఖాయమని ఎందుకు అనౌన్స్‌ చేశారు. ఇప్పుడు ఎందుకు పక్కన పెట్టారని కుమిలిపోతున్నారు. .

సాధారణంగా అయితే ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతాయి. సీనియర్లు గ్రూపులు కడుతారు. ప్రత్యేక క్యాంపులు పెడతారు. రకరకాలుగా ఇబ్బందులు పెట్టి అధినేతను దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తారు. కావాల్సిన డిమాండ్లు నెరవేర్చుకుంటారు. కానీ ఇప్పుడు ఏపీ YCPలో ఆ పరిస్థితి వేరు. అయితే జగన్ మరీ ఏకపక్షంగా వ్యవహరించారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.. ఆయన కనీస సాంప్రదాయాలను కూడా పాటించలేదని పలువురు సీనియర్లు వాపోతున్నారు. మంత్రివర్గంలో చోటు కోసం సాధారణంగానే పోటీ ఎక్కువగా ఉంటుంది. అయితే అందరికీ ఛాన్స్ ఇవ్వడం కుదరదు కాబట్టి.. పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. సీనియర్లైనా కొంతమందికి నిరాశ తప్పదు. అయితే ఇలాంటి సందర్భాల్లో పార్టీ అధినేత స్వయంగా వారికి ఫోన్ చేసి మాట్లాడి.. మీకు పదవి ఇవ్వలేక పోతున్నాను. సర్దుబాటు చేసుకోండి. మళ్లీ అవకాశం వచ్చినప్పుడు చూద్దాం. అంటూ బుజ్జగించడం కామన్..! ఇలా చేస్తే పదవులు పొందలేక పోయిన లీడర్లు కొంతలో కొంత తృప్తి పడుతారు. కానీ అలా కూడా జరగలేదంటూ తెగ ఫీలైపోతున్నారట వైసీపీ నేతలు...మళ్లీ తనంత తానుగా జగన్ ఫోన్ చేస్తే తప్ప ప్రస్తుతానికి చేసేదేమీ లేదని సర్దిచెప్పుకుంటున్నారు సీనియర్లు.

Next Story

RELATED STORIES