తాజా వార్తలు

అక్కడ సెక్యూరిటీ గార్డులు,స్వీపర్లే డాక్టర్లు

అక్కడ సెక్యూరిటీ గార్డులు,స్వీపర్లే డాక్టర్లు
X

అదో ప్రభుత్వాసుపత్రి. అక్కడ అంతా వెరైటీ. వైద్యం చేయాల్సిన సిబ్బంది కబుర్లు చెప్పుకుంటూనో లేదా వేరే ఇంకో పనిలో బిజీగా ఉంటారు. దీంతో ఆస్పత్రిని శుభ్రం చేసే స్వీపర్లు, కాపాల కాసే సెక్యూరిటీ సిబ్బంది శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌లవుతున్నారు. తమకు తెలిసిన వైద్యం చేస్తూ, రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

సెక్యూరిటీ గార్డే కాదు.. ఇక్కడ స్వీపర్లు కూడా రోగులకు వైద్యం చేస్తుంటారు. మరి వైద్య సిబ్బంది అంటారా..? వాళ్లకు జీతాల మీదనే యావ తప్ప, డ్యూటీ మీద కాదు. వైద్యం చేయడం తప్పా.. ఇంకేదో పనిలో బిజీగా ఉంటారు. అందుకే సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు డాక్టర్లుగా, నర్సులగా అవతారమెత్తి వైద్యం చేస్తున్నారు.

ఖమ్మం రాపర్తినగర్‌కు చెందిన అశ్విని ఈనెల 6న పురిటినొప్పులతో ఆసుపత్రిలో చేరింది. వైద్య బృందం శస్త్ర చికిత్స చేసి కాన్పు చేశారు. ఆ తర్వాత బాలింత ఓ వార్డులో ఇన్‌పేషంట్‌గా సేవలు పొందుతోంది. శనివారం అర్ధరాత్రి ఆమెకు అమర్చిన సెలైన్‌ బాటిల్‌లో లిక్విడ్‌ అయిపోయింది. ఆ సమయంలో బాలింతకు తోడుగా ఉన్న ఆమె తల్లి నర్సుకు సమాచారం చేరవేసింది. సేవలందించేందుకు నర్సు నిరాకరించింది. ఇంతలో బాలింత చేయి వాపు వచ్చి నొప్పి చేసింది. ఆందోళన చెందిన ఆమె తల్లి అక్కడున్న స్వీపర్‌ వద్దకు వెళ్లి నర్సును పిలవాలని బతిమిలాడింది. నేనున్నాగా అంటూ స్వీపరే మంచం వద్దకు వచ్చి సెలైన్‌ తొలగించే ప్రయత్నం చేస్తుండగా బాలింత చేతి నుంచి రక్తం ధారలా కారింది. ఆదివారం ఉదయం వరకు తీవ్రమైన నొప్పిని భరిస్తూ నరకయాతన అనుభవించింది. నర్సు వచ్చి చికిత్స అందించే వరకూ బాధను భరించింది. ఈ విషయం తెలిసి ఆస్పత్రి వద్దకు వెళ్లిన మీడియా ప్రతినిధులకు మరి కొన్ని దృశ్యాలు కన్పించాయి. వార్డుల్లో విధులు నిర్వహించాల్సిన నర్సింగ్‌ సిబ్బంది ఒక్కరు కూడా కనిపించలేదు. ఓ సెక్యూరిటీ గార్డు ఓ బాలింతకు సెలెన్‌ బాటిల్‌ పెడుతున్నాడు. దీనిపై అతన్ని ప్రశ్నిస్తే.. తనకు కూడా సెలెన్‌ బాటిల్‌ అమర్చడం వచ్చంటూ చల్లగా అక్కడి జారుకున్నాడు.

ఇక సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించడం, స్వీపర్లు, సెక్యురిటీ గార్డులు వైద్యం చేస్తుండడం తన దృష్టికి వచ్చిందని, దీనిపై విచారించి చర్యలు తీసుకుంటామని తాపీగా సమాధానం చెబుతున్నారు. ఆస్పత్రి ఉన్నతాధికారులు. అయితే మాతా శిశు సంక్షేమ కేంద్రంలో సిబ్బంది నిర్వాకాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలని కోరుతున్నారు.

Next Story

RELATED STORIES