Top

ఆ స్లోగన్ వల్లే వైసీపీ అధికారంలోకి వచ్చింది: టీడీపీ

ఎన్నికల్లో ఘోర ఓటమికి గల కారణాలను అన్వేషిస్తున్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. పార్టీకి అన్ని తక్కువ సీట్లు రావడానికి గల కారణాలు ఏంటో పోస్టుమార్టం నిర్వహించబోతున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇవాళ ఎమ్మెల్యేలతో సమావేశమై చర్చించనున్నారు చంద్రబాబు.

అధికారం చేపడతామని ఆశిస్తే.. కనీసం సగం సీట్లు కూడా సాధించలేకపోయింది టీడీపీ. దీంతో తమ ఘోర ఓటమిపై పోస్టుమార్టం చేస్తున్నారు టీడీపీ అధినేత. సీనియర్‌ నేతలతో సమావేశమైన ఆయన తాజా రాజకీయ పరిణామాలు, బుధవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సుమారు మూడు గంటల పాటు చర్చించారు. ప్రధానంగా ఈనెల 15వ తేదీన టిడిపి విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ హాజరుకానున్నారు.

ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని వైసీపీ అధినేత ఇచ్చిన స్లోగన్ వల్లే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని టిడిపి నేతలు చంద్రబాబు దగ్గర ప్రస్తావించారు. ఎక్కడ కూడా టిడిపి ప్రభుత్వం పై వ్యతిరేకత కనిపించలేదని నేతలు అన్నారు. 1989, 2004లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని ఆనాడు ఓడిపోతున్నామని ముందే అర్థమైందని.. కానీ ఇప్పుడు ఎక్కడా వ్యతిరేకత లేదని నేతలు అభిప్రాయపడ్డారు.

ఇరిగేషన్ ప్రాజెక్టులపై కొత్త ప్రభుత్వం తీసుకునే విధానాల వల్ల నష్టం జరిగే అవకాశం ఉందని నేతలు అన్నారు. టిడిపి హయాంలో ప్రారంభమైన పనులను పక్కన పెట్టేందుకు కొత్త ప్రభుత్వం ఆలోచన చేస్తోందని నేతలు అన్నారు. టీడీపీ నేతలపై అవినీతి ముద్ర వేసేందుకు టెండర్లు అంశాన్ని తెరపైకి కావాలని ప్రభుత్వం తీసుకు వస్తుందని అభిప్రాయాన్ని నేతలు చంద్రబాబు వద్ద వ్యక్తం చేశారు. చంద్రబాబు మాత్రం ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని నేతలకు చెప్పినట్టు తెలుస్తోంది. ఎక్కువ కాలం మౌనంగా ఉండడం మంచిది కాదేమోనని మరికొందరు నేతలు వారి అభిప్రాయాలను తెలిపారు. అయితే కార్యకర్తలకు ఏదైనా జరిగితే నేతలు అండగా ఉండాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ.4వేల కోట్లను తీసుకొచ్చే ప్రయత్నం జరగడం లేదాన్నారు. రైతులకు రుణమాఫీ కింద నాలుగు, ఐదో విడత బకాయిలు చెల్లించాలి. ఖరీఫ్‌లో రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయం నిలిపేయడం సరికాదు’’అని చంద్రబాబు విమర్శించారు.

అలాగే ఈ నెల 12వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై.. ఇవాళ ఉదయం 11 గంటలకు టీడీఎల్పీ సమావేశాన్ని చంద్రబాబు నిర్వహించనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఎమ్మెల్సీలతోను చంద్రబాబు సమావేశం కానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండాలనేది నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు.

Next Story

RELATED STORIES