కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో మరో చిచ్చు

కర్ణాటకలో కాంగ్రెస్-JDS సంకీర్ణ ప్రభుత్వంలో మరో చిచ్చు రాజుకుంది. కేబినెట్ విస్తరణ కొత్త చిక్కును తెచ్చిపెట్టింది. ప్రభుత్వంలో కొత్తగా ముగ్గురికి మంత్రులుగా అవకాశం కల్పించాలని నిర్ణయించారు.. వాటిలో రెండు పదవులను జేడీఎస్‌ నుంచి ఒకటి కాంగ్రెస్‌ నుంచి భర్తీ చేయాలని తొలుత భావించారు. అయితే తాజా మంత్రివర్గంలో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలకు చోటు కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం దీంతో పార్టీ కోసం పని చేసినవారికి కాకుండా, స్వతంత్రులకు మంత్రి పదవులు ఎలా ఇస్తారంటూ కాంగ్రెస్ నాయకులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఇండిపెండెంట్లను కేబినెట్‌లోకి తీసుకోవ డానికి ప్రాతిపదిక ఏంటని హస్తం నాయకులు సూటిగా ప్రశ్నించారు.

ఇక జేడీఎస్‌లోనూ ఇదే పరిస్థితి. ఒక స్థానం మాత్రమే ఖాళీగా ఉండడంతో ఫరూక్‌కు అవకాశం ఉంటుందని ప్రచారం జరిగింది. 7 సార్లు MLC గా కొనసాగిన బసవరాజ్ హొరట్టి పేరు కూడా బలంగానే వినిపించినప్పటికీ చివరి నిమిషంలో వేరే పేరు తెరపైకి రావడంతో హొరట్టి అనుచరులు రగిలిపోతున్నారు. ఆరు నెలలక్రితం విస్తరణ కోసమే కొందరిని తొలగించిన మేరకే రెబల్స్‌గా మారారు. ప్రస్తుత పరిస్థితిలో అంతకంటే భిన్నమైన వాతావరణం కొనసాగుతోంది.

లోక్‌సభ ఎన్నికలకు ముందు కావడంతో అధిష్ఠానం జోక్యం తీవ్రంగా ఉండేది. ప్రస్తుతం దేశమంతటా కాంగ్రెస్‌ ఓటమి నైరాశ్యంలో ఉంది. ఇటువంటి పరిస్థితిలో సొంత పార్టీ నేతలకు కాకుండా స్వతంత్రులకు కేబినెట్‌లో చోటు అంటే... అసంతృప్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీంతో పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ వేణుగోపాల్‌ హుటాహుటిన పలువురు నేతలతో చర్చలు జరిపారు. అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడ్డారు.

మరో వైపు సోమవారం జరగాల్సిన మంత్రివర్గ విస్తరణ శుక్రవారానికి వాయిదాపడింది. ఏది ఏమైనా ‘కేబినెట్‌ విస్తరణ’ అసంతృప్తి అనే తేనెతుట్టెను కదిపినట్టే అవుతుందనే అభిప్రాయం ఇరు పార్టీల నాయకులలో వ్యక్తమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story