పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది హైకోర్టు. ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ స్పీకర్‌, అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు జారీ చేసింది. విలీనం రద్దుపై విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

టీఆర్‌ఎస్‌ లో సీఎల్పీ విలీనం ఎపిసోడ్‌ లో ధర్నాలు, ఆందోళనలు దిగిన కాంగ్రెస్..అటు న్యాయపోరాటం కంటిన్యూ చేస్తోంది. నోటీసులు ఇచ్చాకే విలీనంపై నిర్ణయం తీసుకోవాలని గతంలో భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ పై విచారణ జరిపిన హైకోర్టు..తెలంగాణ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అలాగే అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల సంఘంతో పాటు పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేసింది. సుధీర్‌ రెడ్డి, లింగయ్య, హరిప్రియ, ఉపేందర్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రేగ కాంతారావు, ఆత్రం సక్కు, హర్షవర్దన్‌ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, జాజుల సురేందర్‌ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు.

అటు మండలిలో కాంగ్రెస్‌ పక్షాన్ని తెరాసలో విలీనం చేయడంపైనా గతంలో దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. రాజ్యాంగ విరుద్ధంగా విలీనం చేశారంటూ షబ్బీర్‌ అలీ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన ఉన్నత న్యాయస్థానం మండలి ఛైర్మన్‌, కార్యదర్శి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీచేసింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు ఎం.ఎస్‌ ప్రభాకర్‌రావు, దామోదర్‌ రెడ్డి, సంతోష్‌ కుమార్‌, ఆకుల లలితకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఫిరాయింపులపై న్యాయపోరాటానికి దిగిన కాంగ్రెస్‌ అటు టీఆర్‌ఎస్‌ లో విలీనంపై కూడా లీగల్ వార్‌ కు దిగింది. విలీనం బులెటిన్‌ ను రద్దు చేయాలని ఇప్పటికే హైకోర్టు పిటీషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story