బాలిక స్నానం చేస్తుండగా ఫోటోలు తీసి..

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పనపాకం గ్రామంలో దారుణం జరిగింది. కొందరు కామాంధుల లైంగిక వేధింపుల భరించలేక ఓ మైనర్ బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే బంధువులు గమనించడంతో ప్రాణాపాయం తప్పింది.
పనపాకంకు చెందిన ఓ బాలిక చంద్రగిరిలోని వసతి గృహంలో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో 9 వ తరగతి చదువుతోంది. ఆమె తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి వికలాంగుడు కావడంతో నానమ్మే బాలిక బాగోగులు చూస్తోంది. వేసవి సెలవులు కావడంతో ఆమె తన స్వగ్రామానికి వచ్చింది. బాలిక స్నానం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన మోహన్ సెల్‌ఫోన్ లో ఫోటోలు తీశాడు. వీటిని చూపించి బాలికపై లైంగిక దాడి చేశాడు. అంతటితో ఆగక మోహన్ తన స్నేహితులైన నాగార్జున, పార్థసారథి, చక్రవర్తి, జగపతికి అశ్లీల దృశ్యాలను పంపించాడు. వారు కూడా తమతో గడపకుంటే ఫోటోలను ఫేస్ బుక్ లో పెడ్తామని వేధించారు. దీంతో మనస్థాపానికి గురైన బాలిక ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీన్ని ఆమె నానమ్మ గమనించి, వారించింది. అసలేం జరిగిందో ఆరా తీసింది. బాలిక జరిగిన సంగతంతా నానమ్మకు చెప్పింది. గ్రామస్తుల సహకారంతో ఆమె చంద్రగిరి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకొని, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com