చిన్నమ్మకు వీడుతున్న చిక్కుముడులు!

అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ త్వరలో జైలు నుంచి విడుదల కానున్నారా? రెండేళ్లు ముందుగానే కారాగారం నుంచి బయట పడనున్నారా? ఇప్పుడిదే చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీగా శశికళను విడుదల చేయడానికి కర్ణాటక జైళ్ల శాఖ, కర్ణాటక ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు సమాచారం. డిసెంబర్‌లోనే చిన్నమ్మ విడుదల అవుతారని ఆమె వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. దాదాపు ఏడాది, ఏడాదిన్నర ముందుగానే జైలు నుంచి శశికళ బయటకు వస్తారని
జయలలిత అక్రమాస్తు కేసులో శశికళతో పాటు ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్‌లకు దోషిగా తేల్చిన సుప్రీంకోర్టు... నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. 2017 ఫిబ్రవరిలో కోర్టు తీర్పు ఇవ్వడంతో ఆమెను బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలుకు తరలించారు. జైలు శిక్షలో ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి. మరో రెండేళ్లు కారాగారవాసం గడపాల్సి ఉంది. ఐతే, జైలు జీవితంలో చిన్నమ్మ సత్ప్రవర్తనతో మెలిగారని కర్ణాటక జైళ్ల శాఖ నివేదిక తయారు చేసినట్లు సమాచారం. కారాగారవాసం అనుభవిస్తున్నప్పుడు వివాదాలు, గొడవలకు శశికళ దూరంగా ఉన్నారని, అందువల్ల ఆమెను ముందుగానే విడుదల చేయవచ్చంటూ కర్ణాటక జైళ్ల శాఖ, కర్ణాటక ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నివేదిక ఆధారంగా కర్ణాటక ప్రభుత్వం త్వరలో ఓ నిర్ణయం తీసుకోనుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలతో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాల్లో సంతోషం పొంగిపొర్లుతోంది.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం శశికళ శిక్షా కాలం 2021 ఫిబ్రవరిలో ముగుస్తుంది. ఒకవేళ జైళ్ల శాఖ సిఫారసును కర్ణాటక ప్రభుత్వం అంగీకరిస్తే, ఈ డిసెంబర్‌లోనే ఆమె జైలు నుంచి బయటకు రావొచ్చని అంటున్నారు. మరి నిజంగానే ఇది జరుగుతుందా అంటే ఏమైనా జరగొచ్చు అనే వాదనలే వినిపిస్తున్నాయి. చిన్నమ్మను ముందుగానే జైలు నుంచి విడుదల చేయడానికి సన్నాహాలు జరగడం వెనక రాజకీయ వ్యవహారాలు ఉండొచ్చనే ఆరోపణలూ ఉన్నాయి. అయితే, అసలు శశికళను సత్ప్రవర్తన కింద ఎలా విడుదల చేస్తారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. జైలులో ఆమె ఇష్టారాజ్యంగా ఉన్నారని, అవసరమైనప్పుడు షాపింగ్‌లకు కూడా వెళ్లారని గుర్తు చేస్తున్నారు. ఈ అంశంపై కోర్టులో విచారణ జరుగుతోందని, ఇలాంటి సమయంలో ఆమెను ముందస్తుగా విడుదల చేయడానికి ఎందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రశ్నిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com