Top

తెలుగు రాష్ట్రాల్లో మోగిన బడిగంట!

తెలుగు రాష్ట్రాల్లో మోగిన బడిగంట!
X

తెలుగు రాష్ట్రాల్లో ఇవ్వాల్టి నుంచి మళ్లీ బడిగంట మోగనుంది. నిన్న మొన్నటి వ‌ర‌కు ఆట పాట‌ల‌తో స‌ర‌దాగా గ‌డిపిన విద్యార్ధులు బ్యాగులు వేసుకుని పాఠ‌శాల‌లకు ప‌రుగులు తీసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు నిబంధనలు అతిక్రమిస్తే, స్కూళ్లను సీజ్‌ చేస్తామని ప్రైవేట్ స్కూల్ యజమాన్యాలను ప్రభుత్వాలు హెచ్చరించాయి.

వేసవి సెలవులు ముగిసాయి. సుమారు 40 రోజులు బంధువుల ఇళ్లలో సరదాగా గడిపిన విద్యార్థులు నేటి నుంచి మళ్లీ పాఠశాలలకు వెళ్లనున్నారు. కొత్త తరగతి, కొత్త పుస్తకాలతో మళ్లీ కుస్తీ పట్టనున్నారు. పై క్లాసుల్లో చేరుతున్నామన్న ఉత్సాహం పిల్లల్లో ఉరకలేస్తోంది. అయితే కొందరు గడుగ్గాయిలు మాత్రం ఎప్పటి మాదిరిగానే మారాం చేసేందుకు ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు. వారిని పాఠశాలలకు పంపేందుకు.. బుజ్జగింపులు, లాలింపులు కామనే. ఒంటరిగా స్కూళ్లలో వదిలిపోతున్న తల్లిదండ్రులు పిల్లలకు శత్రువులుగా కనిపిస్తుంటారు.

సాధారణంగా జూన్ 1 నుంచే బడులు ప్రారంభం కావాలి. కానీ ఈసారి ఎండలు మండిపోవడంతో ఈనెల 12నుంచి మొదలు పెడ్తున్నారు. ఇక ప్రైవేట్‌ స్కూళ్లు ఫీజు మోత మోగించడానికి సిద్ధమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. గత ఏడాది మాదిరిగానే చాలా గవర్నమెంట్‌ స్కూళ్లలోకి పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ లు ఇంకా పూర్తిస్థాయిలో చేరలేదు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో ఇప్పటికే ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటి సర్వే నిర్వహించి.. గ్రామాలు, ఆవాస ప్రాంతాల్లో ర్యాలీలు చేపట్టారు. బడి ఈడు పిల్లల్ని గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించారు.

ఏపీలో ఇవ్వాల్టి నుంచి 3 రోజుల పాటు రాజన్న బడి బాట నిర్వహిస్తారు. తొలిరోజు కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అన్ని స్కూళ్లలో సంబరాలు చేపడతారు. పాఠశాలలను సంప్రదాయంగా అలంకరించి జాతీయ గీతాలాపనతో బడిబాట ప్రారంభిస్తారు. చిన్నారులకు పాఠశాలలపై భయం పోగొట్టి, చదువుకునేలా ప్రోత్సహించాలని విద్యాశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేయనున్నారు. ఆ రోజు విద్యార్థులకు పాఠాలు చెప్పరు. ఆటలు, పాటలు, డాన్స్‌, మ్యూజిక్‌, డ్రాయింగ్‌.. తదితర తరగతులు నిర్వహిస్తారు. వీటి ద్వారా మానసిక స్థైర్యాన్ని, పోటీ తత్వాన్ని పెంచనున్నారు. ప్రాథమిక పాఠశాలల్లోని 1 నుంచి 5వ తరగతి వరకు దీన్ని అమలు చేయనున్నారు. అలాగే 1- 10 విద్యార్థుల కోసం ‘హ్యాపీనెస్‌ కరిక్యులమ్‌’ను ప్రవేశపెట్టనున్నారు. విద్యార్థుల మనసు ప్రశాంతంగా ఉండేలా చేయడం, ఉత్తేజపరచడం చేస్తారు.

ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించిది. స్కూల్ పేరు చివర్లో తోకలుంటే అనుమతి ఇవ్వమని స్పష్టం చేసింది. ఇక స్కూల్ బ్యాగ్స్ బరువు విషయంలోనూ స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రైవేట్ స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే తనిఖీలు ముమ్మరం చేశారు. నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు.

Next Story

RELATED STORIES