హెచ్చరిక.. గంటకు 135 కి.మీ. వేగంతో బలమైన గాలులు..!

హెచ్చరిక.. గంటకు 135 కి.మీ. వేగంతో బలమైన గాలులు..!

గుజరాత్‌ వైపు వాయు తుఫాను దూసుకువస్తోంది. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు తీరాన్ని భయపెడుతున్నాయి. ఇప్పటికే గుజరాత్‌లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నాయి. తుఫాను హెచ్చరికలతో ఇప్పటికే కేంద్ర సహాయక బృందాలు గుజరాత్‌ చేరుకున్నాయి.

వాయు తుఫాను గుజరాత్‌ను వణికిస్తోంది. అరేబియా సముద్రంలో మూడ్రోజుల కిందట ఏర్పడ్డ అల్ప పీడనం క్రమంగా బలపడుతూ తుఫాన్‌గా మారుతోంది. ఈ తుఫాన్‌కు వాయు అని నామకరణం చేశారు. ఇవాళ ఇది పోర్‌ బందర్‌, మహువా ప్రాంతంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు 110 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే సముద్రంలో అలలు భారీగా ఎగిసి పడుతున్నాయి. ఈ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురు గాలులతో ప్రజాజీవనం అస్తవ్యస్తం కావచ్చని భావించిన ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది.

గుజరాత్‌ వ్యాప్తంగా హై అలర్ట్ ను ప్రకటించారు. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలతో బాటు సుమారు 10 జిల్లాల నుంచి అప్పుడే 3 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల కోసం ఆర్మీ, నేవీ, వైమానిక దళాలను, బీ ఎస్ ఎఫ్ సిబ్బందిని సన్నద్ధం చేశారు. స్కూళ్ళు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. అధికారులకు సెలవులను ప్రభుత్వం రద్ది చేసింది. విమానాలు, రైలు సర్వీసులకు అంతరాయం కలుగుతుందని భావించిన ప్రభుత్వం.. కొన్ని మార్గాల్లో వీటిని రద్దు చేశారు. మరికొన్నింటి దారి మళ్లించారు. గాంధీనగర్ లోని ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ లో సీఎం విజయ్ రూపానీ సహాయక చర్యల సన్నాహాలను సమీక్షించారు. సౌరాష్ట్ర , భావ్‌నగర్‌, గిరి సోమ్‌నాథ్‌, జునాగడ్‌, డియూ, డామన్‌, దాద్రానగర్‌ హవేలీ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు పోరుబందర్‌, డియూ, భావ్‌నగర్‌, కాండ్ల ఎయిర్‌పోర్ట్‌లను మూసేశారు.

వాయుతుఫాన్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాన్‌ నష్టాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా చర్చించారు. సైక్లోన్‌ ప్రభావ ప్రాంతాలైన గుజరాత్‌, మహరాష్ట్ర, గోవా, కర్నాటక, డయ్యూ డామన్‌ ప్రభుత్వాలతో కేంద్ర హోంశాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు ప్రాణ నష్టం తగ్గించేందుకు ప్రధాని మోదీ.. ప్రజలకు సూచనలు చేశారు ఎప్పటికప్పుడు స్థానిక ఏజెన్సీలు అందించే సమాచారం ప్రకారం నడుచుకోవాలంటూ ట్వీట్‌ చేశారు. ప్రజలు సురక్షితంగా ఉండాలని దేవుడిని ప్రార్థస్తున్నానన్నారు.

Tags

Read MoreRead Less
Next Story