ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా ఆముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికవనున్నారు. స్పీకర్ ఎన్నికకు సంబంధించి బుధవారం తమ్మినేని ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నిక లాంచనప్రాయమైంది. స్పీకర్ ఎన్నిక కోసం బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. సీతారాం నామినేషన్‌ను 11 మంది మంత్రులు, 19 మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. దీంతో ఆయన తన నామినేషన్.. అసెంబ్లీ ఇన్‌చార్జ్ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు సమర్పించారు.
గురువారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. తర్వాత ఆయన సభాపతి స్థానంలో కూర్చోనున్నారు. ఆపై స్పీకర్ ఎన్నిక పట్ల సభలో సభ్యులు వారి స్పందనను తెలియజేస్తూ అభినందలు తెలుపుతారు.
మరోవైపు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగాల్సి ఉండటంతో.. దీనికి సంబందించి ప్రకటన ఇవాళ వెలువడే అవకాశం ఉందని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. బాపట్ల నుంచి ఎన్నికైన కోన రఘుపతిని డిప్యూటీ స్పీకర్ పదవికి... సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇప్పటికే ఖరారు చేశారు. రఘుపతి నామినేషన్ దాఖలు చేశాక... సోమవారం ఆయన ఎన్నికైనట్లు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com