తొలి ప్రసంగంలోనే జగన్‌ ఇలా మాట్లాడటం సరికాదు - చంద్రబాబు

ఏపీ శాసనసభ సమావేశాల రెండోరోజూ... అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. స్పీకర్‌కు ధన్యావాదాలు తెలిపే అంశంపై చర్చ సందర్భంగా ఇరుపక్షాలు పోటాపోటీగా విమర్శలకు దిగాయి. ప్రధానంగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సీఎం జగన్‌, విపక్ష నేత చంద్రబాబు విమర్శలు, ప్రతివిమర్శలతో సభ హాట్‌హాట్‌గా నడిచింది. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను సంతలో మాదిరిగా కొనుగోలు చేశారంటూ సీఎం జగన్‌ ఘటుగా విమర్శించారు. కానీ ఎన్నికల్లో టీడీపీ తరుపున కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే గెలిచారని, దేవుడే ఈ తీర్పు ఇచ్చారన్నారు జగన్‌.

టీడీపీ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించిందంటూ విమర్శించారు జగన్‌. తాను చంద్రబాబులా ఆలోచిస్తే... సభలో చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా దక్కేది కాదన్నారు జగన్‌. అటు సీఎం జగన్‌ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. తొలి ప్రసంగంలోనే జగన్‌ ఇలా మాట్లాడటం సరికాదన్నారు. ప్రతిపక్షాన్ని కించపరిచేలా జగన్‌ ప్రసంగం ఉందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్‌ ఎన్నికపై కనీసం మాటమాత్రమైనా తమకు చెప్పలేదన్నారు చంద్రబాబు.

మొత్తానికి స్పీకర్‌ బాధ్యతలు, గత అనుభవాలు, పాఠాలను గుర్తుచేసుకుని... ఎవరి బాధ్యతలు ఎలా ఉండాలో చర్చించుకోవాల్సిన సభలో ఇలా సంప్రదాయాలపై విమర్శలకు దిగడాన్ని ప్రశ్నించారు. స్పీకర్‌ ఎన్నికలో బాధ్యతగా వ్యవహరించాల్సిన నేతలు ఇలా వాదులాడుకోవడం మంచిది కాదంటున్నారు విశ్లేషకులు.

Tags

Read MoreRead Less
Next Story