పగలు సీరియల్స్‌లో నటిస్తూ.. రాత్రిళ్లు ఆటో నడుపుతూ..

ఆమె ఏమైనా చేయగలదు. ఆర్థిక బాధల నుంచి గట్టెక్కాలి. అమ్మా నాన్నని బతికించాలి. ఆడపిల్ల గడప దాటితే రక్షణ లేదన్న వారికి తాను సమాధానం కావాలి. ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి. అవసరం అన్నీ నేర్పిస్తుంది అంటే ఇదేనేమో. గరిటె పట్టాల్సిన చేతులు స్టీరింగ్ పట్టాయి. ముంబయి మహానగరంలో అర్థరాత్రి వరకు ఆటో నడుపుతూ, పగలు సీరియల్స్‌లో నటిస్తూ.. రెండు పాత్రల్నీ సమర్థవంతంగా పోషిస్తోంది లక్ష్మి. మరాఠీ సీరియల్లో నటిస్తున్న లక్ష్మికి వచ్చే డబ్బులు సరిపోవట్లేదు. కుటుంబానికి తానే ఆసరా. ఏపనైనా చేయాలి. గౌరవంగా బ్రతకాలి. ఒకరి పంచన చేరకుండా.. ఒకరిని చేయి చాచకుండా.. నమ్ముకున్న వారిని నట్టేట ముంచకుండా.. తాను బ్రతుకుతూ.. తన వారిని బ్రతికించాలి. అందుకు ఆటో డ్రైవర్‌గా మారింది లక్ష్మి. ఆసక్తి, పట్టుదల ఉంటే అన్నీ త్వరగానే వస్తాయి. మగవారికి ధీటుగా తానూ ఆటో డ్రైవింగ్ నేర్చుకుని సొంతంగా ఓ ఆటో కొనుక్కుంది. తన ఆటో ఎక్కిన ప్రయాణీకుల్ని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తూ వారి అభిమానాన్ని చూరగొంటోంది. ఇలానే లక్ష్మి ఆటో ఎక్కారు నటుడు బొమన్ ఇరానీ. ఆమె ధైర్యానికి మెచ్చుకుంటూ.. అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిన రియల్ హీరో లక్ష్మీ అంటూ తనతో కలిసి ప్రయాణం చేసిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com