‘గేమ్ ఓవర్’ రివ్యూ

‘గేమ్ ఓవర్’  రివ్యూ

నటీనటులు - తాప్సీ - వినోదిని వైద్యనాధన్ - అనీష్ కురువిల్లా - సంచనా నటరాజన్ - రమ్య సుబ్రహ్మణ్యన్ - టి పార్వతి తదితరులు

సంగీతం - రాన్ ఎతాన్ యోహన్

ఛాయాగ్రహణం - ఎ వసంత్

ఎడిటింగ్ : రిచర్డ్ కెవిన్

సంభాషణలు : వెంకట్ కచర్ల

కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : అశ్విన్ శరవణన్

రెగ్యులర్ కమర్షియల్ సినిమాల నుండి బ్రేక్ తీసుకొని కాన్సెప్ట్ సినిమాలతో పుల్ జోష్ లో ఉన్న తాప్సి గేమ్ ఓవర్ కి ప్రధాన ఆకర్షణగా మారింది.తాప్సి గత చిత్రాల అందించిన అనుభవం, ఆమె కథల ఎంపికపై ఆమెకున్న జడ్జిమెంట్ ‘గేమ్ ఓవర్’పై ఆసక్తిని కలిగించాయి. ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉంది. ఈ శుక్రావారం చూడాలనిపించే సినిమాల లిస్ట్ లో గేమ్ ఓవర్ ని ముందు నిలిపాయి. మరి తాప్సి ఆడిన గేమ్ ఎలా ఉందో చూద్దాం..

కథ:

హైదరాబాద్ శివార్లలో కోకాపేట గేటెడ్ కమ్యూనిటీలో చివరి ఇంట్లో ఒంటరిగా ఉంటుంది స్వప్న(తాప్సీ ). గేమింగ్ డవలెపర్ అయిన స్వప్న కొన్ని సంఘటనల కారణంగా తన పనులు ఇంటినుండే చేస్తుంటుంది. తన ఇంట్లో పనిమనిషి కాలమ్మ, సెక్యూరిటీ అన్వర్ తప్ప మరొకరు ఉండరు. యేడాది క్రితం డిసెంబర్ 31న జరిగిన ఒక సంఘటన స్వప్న మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. ఆమెకు చీకటి అంటే భయం , ఆ భయానికి తోడు ఎంతో ఇష్టంగా వేసుకున్న ‘టాటూ’ తో భరించలేని శారీరక హింసను అనుభవిస్తుంటుంది. ఈ భయాలను, బాధలను భరించలేక చనిపోవాలనుకుంటుంది. కానీ స్వప్న మానసిక స్థితికి కారణం వేరే అనితెలుస్తుంది. మనుషులను అతి కిరాతంగా చంపి, ఆ చంపే విధానాన్ని వీడియో తీసి ఆనందించే ఒక గ్యాంగ్ తో తను పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఆ గేమ్ లో స్వప్న ఎలా గెలిచింది అనేది మిగిలిన కథ..?

కథనం - విశ్లేషణ:

కథను ఎలా చెప్పాలి, ఎలా ఆపాలి అనే విషయం పై స్పష్టమైన అవగాహాన ఉన్న దర్శకుడు అశ్విన్ శరవణన్. ప్రేక్షకులను భయపెట్టే ఒక సంఘటనతో కథ చెప్పడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత జరుగుతున్న విషయాలు మామూలుగా కనిపించినా, ముందు చూసిన దృశ్యం తాలూకు ప్రభావం ఈ సన్నివేశాల పై పడి వాటిని కూడా టెన్షన్ గా చూడటం మొదలు పెడతారు ప్రేక్షకులు. ఈ విషయంలో దర్శకుడి ప్రతిభకు మెచ్చుకోవాల్సిందే. తాప్సి సినిమాను తన భుజాలపై మోసింది అనడంలో సందేహం లేదు. ఒక దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్న తర్వాత ఆ అమ్మాయి ప్రవర్తన, మానసిక స్థితి ఎలా ఉంటుందో తాప్సి ఆ పాత్రలో అలా ప్రవర్తించింది. జీవితాన్ని మర్చేసిన సంఘటనను గర్తు చేసుకుంటూ పనిమనిషిని పట్టుకునే ఏడ్చే సన్నివేశంలో తాప్సి నటన హృదయాలకు తాకుతుంది. ఒక మర్డర్ మిస్టరీ గా కథను మొదలు పెట్టి టాటూ ఆర్టిస్ట్ తో కథకు ఒక ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకుల ఊహాకు అందని థ్రిల్ ని కలిగించాడు దర్శకుడు అశ్విన్. సినిమాలో ఎక్కువ భాగం ఒకే ఇంట్లో జరుగుతుంది. చాలా సన్నివేశాల్లో తాప్సి పనిమనిషిగా కనిపించిన వినోదిన వైధ్యనాథన్ తప్ప మరొకరు కనిపించరు. తాప్సి క్యారెక్టర్ లో హైపర్ ఉండదు. లవ్ స్టోరీ ఉండదు. రోమాన్స్ కు తావులేదు, పాటల జోలికి వెళ్ళలేదు( ఎండ్ టైటిల్స్ తో సహా) ఇలాంటి లిమిటేషన్స్ మద్య ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయడం చాలా పెద్ద చాలెంజ్ ని ఈ ఛాలెంజ్ ని తాప్సితో కలసి గెలిచాడు దర్శకుడు. మర్దర్ మిస్టరీ , రివైంజ్ డ్రామా ల వైపు ఆడియన్స్ ఆలోచనలు కదులుతున్న సమయంలో టాటూ తో ఒక ట్విస్ట్ ఇచ్చి హార్రర్ లక్షణాలు జోడించాడు. అసలు తాప్సి కి జరిగిన సంఘటన ఒక మెయిన్ ఎపిసోడ్ లా డీల్ చేయకుండా ఆడియో టేప్ లు, కొన్ని కట్ షాట్స్ తో ఆ సీన్ ఇంపాక్ట్ ని తెరమీదకు తీసుకురాగలిగాడు. మర్డర్ మిస్టరీ గా నడుస్తున్న కథలో దర్శకుడు శరవణ్ ఇచ్చిన ఎమోషనల్ టచ్ చాలా కనెక్ట్ అవుతుంది. చేతిమీద టాటూ తనతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. తనను కాపాడుతుంది. తనను పోరాడమంటుంది లాంటి ఎమోషనల్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన రాన్ ఏతన్ యోహాన్. సింపుల్ గా చెప్పాలంటే అదరగొట్టాడు. ఇక వసంత్ సినిమాటోగ్రఫీ ఈకథలో కనిపించని హీరో అని చెప్పాలి. తాప్సి కీ జోడీ ఎవరూ లేరు కాబట్టి ఈ కథలో తాప్సితో కెమెరాకు కెమిస్ట్రీ బాగా పండింది. నెక్ట్స్ ఏ జరుగుతుందో ఆలోచనలను అందకుండా సాగే కథనం గేమ్ మీద ఇంట్రస్ట్ ని పెంచాయి. టాటు లు కనిపించడం మాయం అవడం లాంటి ఎపెక్ట్ లతో దర్శకుడు క్లైమాక్స్ ని మరింత గ్రిప్పింగ్ మార్చాడు. తాప్సి తన బెస్ట్ ని ఇచ్చిందని చెప్పవచ్చు. వన్ ఉమెన్ షో అనడంలో సందేహంలేదు. జరిగిన ఏ సంఘటనలూ నేరుగా ప్రేక్షకులకు కనిపించవు, అవి తాప్సి రియాక్షన్స్ లోనే తెలుస్తాయి. ఏ ఆర్టిస్ట్ కయినా ఛాలెంజ్ గా అనిపించే సన్నివేశాలను తాప్సి అద్భుతంగా పండించింది.

థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారిని ‘గేమ్ ఓవర్’ తప్పకుండా ఎంగేజ్ చేస్తుంది.

చివరిగా:

ఇంట్రెస్టింగ్ గేమ్

Tags

Read MoreRead Less
Next Story