పాకిస్థాన్‌కు భారత ప్రధాని మోదీ హెచ్చరిక

పాకిస్థాన్‌కు భారత ప్రధాని మోదీ హెచ్చరిక

రెండ్రోజుల పాటు కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో జరిగిన షాంఘై సహకార సదస్సులో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఈ వేదిక నుంచి పాకిస్థాన్ కు గట్టి హెచ్చరికలు పంపారు. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఎదుటే పరోక్షంగా చురకలు అంటించారు. భారత్‌ను ఎదుర్కునేందుకు ఓ దేశం గత కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచిపోషించడమే తన విధానంగా మార్చుకుందన్నారు. ఉగ్రపీడ వదిలించేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో ఎస్‌సీవో దేశాలు పరస్పర సహకారం అందించుకోవాలన్నారు. ఉగ్రవాద రహిత సమాజం కోసం భారత్‌ కట్టుబడి ఉందన్నారు.

ఎస్‌సీవో సభ్య దేశాలకు మోదీ హెల్త్‌ మంత్రాన్ని చెప్పారు. HEALTHలో ఒక్కో అక్షరానికి ఒక్కో అర్థం ఉందని వివరించారు. ‘H అంటే హెల్త్‌ అండ్‌ మెడికేర్‌ అని E అంటే ఎకో అని A అంటే ఆల్టర్నేట్‌ కనెక్టివిటీ, L అంటే లిటరేచర్‌, T అంటే టెర్రరిజం ఫ్రీ సొసైటీ, H అంటే హ్యుమానిటీ అని మోదీ చెప్పుకొచ్చారు. ఇలా ప్రపంచ దేశాలు పరస్పరం సహకారం అందించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.

బిష్కెక్‌ వేదికగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను టార్గెట్ చేశారు మోదీ. అన్ని దేశాల నేతలతోనూ మాటలు కలిపారు. రెండ్రోజుల పాటు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ను పట్టించుకోకుండా మసలిన ప్రధాని మోదీ చివరకు ఆయన్ను పలకరించాల్సి వచ్చింది. ఈ సదస్సులో లీడర్స్‌ లాంజ్‌లో ఉన్నప్పుడు ఇమ్రాన్‌ను పలకరించి షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇమ్రాన్‌ఖాన్‌.. ఎన్నికల్లో విజయంపై మోదీకి అభినందనలు తెలిపినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story