తెలంగాణ మంత్రి వర్గ సమావేశానికి ముహూర్తం ఖరారు

తెలంగాణ మంత్రి వర్గ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. వరుస ఎన్నికలు.. కోడ్‌ కారణంగా నాలుగు నెలల పాటు కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో కేసీఆర్‌ సర్కార్‌ వెనుకడుగు వేస్తూ వస్తోంది. ఇప్పుడు ఎన్నికలన్ని ముగియడంతో పాలనపై పూర్తి దృష్టి పెట్టింది టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం.ఇందులో భాగంగా ఈనెల 18న క్యాబినెట్‌ నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే 19న టిఆర్‌ఎస్‌ కార్యవర్గ సమావేశం జరగనుంది.

వరుస ఎన్నికలతో తెలంగాణ ప్రభుత్వం బిజీ అయ్యింది. లోక్‌సభ, ఎమ్మెల్సీ, స్థానిక, ప్రాదేశిక ఎన్నికల్లో పార్టీ గెలుపుపై గులాబి అధినేత ఫోకస్‌ చేయడంతో.. పాలన పరంగా చాలా నిర్ణయాలు వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎన్నికలు అన్ని ముగిశాయి. దీంతో పాలనపై పూర్తి దృష్టి పెట్టారు సీఎం కేసీఆర్‌. ఇందులో భాగంగా ఈనెల 18న మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దాదాపు నాలుగు నెలల తరువాత ఈ భేటీ జరుగుతుండడంపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ నూతన పురపాలన చట్టంతో పాటు రెవెన్యూ చట్టంలో సంస్కరణలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నూతనంగా రుణాన్ని మంజూరు చేసిన నేపథ్యంలో... దానిపై కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతు రుణమాఫీ, పెన్షన్లు పెంపు అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చని సమాచారం.

కొత్త సచివాలయం నిర్మాణంపైనా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం ఇటీవల తెలంగాణ సచివాలయంలోని తమ భవనాలను వదులుకున్న నేపథ్యంలో... పాత సచివాలయం స్థానంలోనే కొత్త సచివాలయం నిర్మాణానికి తెలంగాణ సర్కార్ ప్లాన్ చేస్తోంది. దీనిపై కూడా మంత్రివర్గంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఇప్పటికే ఇతర రాష్ట్రాల సీఎంలను, ఇతరనేతలను ఆహ్వానించిన సీఎం.. ఆయా నేతలతో చర్చించిన అంశాలను మంత్రులకు వివరించే అవకాశం ఉంది. అలాగే పలు చట్టాల్లో మార్పులకు సంబంధించి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గం సమావేశం జరిగే మరుసటి రోజే టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం కూడా జరగనుంది. ఈ నెల 19న టీఆర్ఎస్ భవన్‌లో ఈ సమావేశం జరపాలని పార్టీ నిర్ణయించింది. కేసీఆర్ అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశంలో పార్టీకి ఆయన ఎలాంటి దిశానిర్ధేశం చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story