క్రైమ్

తాంత్రికుడి కోర్కె తీర్చమంటూ భార్యని..

తాంత్రికుడి కోర్కె తీర్చమంటూ భార్యని..
X

అంతరిక్షంలోకి అడుగులు వేసినా, శాస్త్ర విజ్ఞానం కొత్త పుంతలు తొక్కినా మనిషి ఆలోచనలు పాతాళంలోనే ఉంటున్నాయి. ఇంకా మాయలు, మంత్రాలు అంటూ వాటిని పట్టుకుని వేళ్లాడుతూనే ఉన్నాడు. మనిషి బలహీనతల్ని ఆసరా చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు కొందరు వ్యక్తులు. వీరి బారిన పడి ఇల్లూ, ఒళ్లూ గుల్ల చేసుకునే వారు కొందరైతే మాయలు, మంత్రాల పేరుతో లైంగిక దాడులకు బలైపోయే మహిళలు మరెందరో. ఇలానే తాంత్రికుడి మాయలో పడిన ఓ వ్యక్తి అతడి లైంగిక కోర్కె తీర్చాలంటూ భార్యను వేధించాడు. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో దారుణంగా హత్య చేశాడు.

ఉత్తరప్రదేశ్‌ అలీగఢ్‌కు చెందిన మాన్‌పాల్ అనే వ్యక్తికి సంత్‌దాస్ దుర్గాదాస్ అనే తాంత్రికుడితో పరిచయం అయింది. తాంత్రికుడి మాయలో పడిపోయిన మాన్‌పాల్ అతడేం చెబితే అది చేసేవాడు. డబ్బులు కూడా చాలా పోగొట్టుకున్నాడు. భార్య వద్దని వారించినా వినేవాడు కాదు. మాన్‌పాల్‌ని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకున్న తరువాత మెల్లగా తన మనసులోని కోరికని బయటపెట్టాడు. నన్ను శాంత పరిస్తే నికింకా మంచి జరుగుతుంది అని నమ్మించాడు. అందుకు ఏంచేయమంటారు స్వామి అని అడిగిన మాన్‌పాల్‌కి తన మనసులోని దుర్భుద్ధిన్ని బయటపెట్టాడు దుర్గాదాస్. నీ భార్యను ఓసారి నా దగ్గరకు పంపించు అన్నాడు. దాంతో మాన్‌పాల్ ఏ మాత్రం సంకోచించకుండా భార్యకు విషయాన్ని చెప్పాడు. ఆమె మనసు కీడు శంకించింది.

నేను ఆ మాయల పకీరు దగ్గరకు వెళ్లనంటే వెళ్లనని ఖరా ఖండిగా చెప్పింది. దీంతో భార్యపై ఆగ్రహోదగ్రుడైన భర్త ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. సరే.. తాంత్రికుడి దగ్గరకు వెళ్లవద్దు కానీ కుటుంబం కోసం నది వద్దకు వెళ్లి పూజలు చేద్దామని చెప్పాడు. అక్కడికి చేరుకున్న భార్యని తాంత్రికుడు, తానూ కలిసి ఆమెని నీళ్లలో ముంచి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. తన తల్లిని హత్య చేస్తుండగా చూసిన కుమారుడు గ్రామంలోకి వెళ్లి స్థానికులకు సమాచారం అందించాడు. దీంతో నది వద్దకు చేరుకున్న గ్రామస్థులు నిందితులిద్దరనీ పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఆమెని ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యానేరం అభియోగం కింద మాన్‌పాల్‌ని, దుర్గాదాస్‌ని అరెస్టు చేసి కటకటాల్లో పడేశారు.

Next Story

RELATED STORIES