జవాన్ ఆవేదన.. తన భూమిని మరోవ్యక్తి పేరుపై పట్టా చేసిన రెవెన్యూ అధికారులు

జవాన్ ఆవేదన.. తన భూమిని మరోవ్యక్తి పేరుపై పట్టా చేసిన రెవెన్యూ అధికారులు

ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ రక్షణ కోసం పాటుపడేది జవాన్‌. సరిహద్దుల్లో ప్రత్యర్థి తూటకు ధైర్యంగా ఎదురెళ్లే ధీరత్వం జవాన్‌ది. పగలనక రాత్రనక దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో కాపలా కాస్తున్న ఆ జవాన్‌కు నేడు భరోసా లేకుండా పోయింది. జవాన్‌ భూమికి భద్రత లేకుండా పోయింది. సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్న తనవారి ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందంటూ ఓ యువ సైనికుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జవాన్‌ సెల్ఫీ వీడియో అందరిని కలిచి వేస్తోంది. ఇంతకీ ఆజవాన్‌కు వచ్చిన కష్టమేంటి? అతను ఏమంటున్నాడో ఓ సారి చూద్దాం.

తెలంగాణ రెవెన్యూ శాఖలో అక్రమాలపై ఓ జవాన్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఇలా వీడియో రిలీజ్ చేశాడు. దేశానికి పహారా కాసే సైనికుల భూమికే రక్షణ లేకుండా పోయిందని చెప్తూ.. ఈ వీడియో సీఎం కేసీఆర్ వరకూ చేరాలని విజ్ఞప్తి చేశాడు. తన భూమి పట్టాను రెవెన్యూ అధికారులు అక్రమంగా వేరొకరికి ఇచ్చారని స్వామి ఆరోపిస్తున్నారు.

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాలకు చెందిన స్వామి ఆర్మీలో సైనికుడిగా పని చేస్తున్నాడు. తన తండ్రి సాయిరెడ్డి పేరు మీద గ్రామ శివారులో ఆరు ఎకరాల రెండు గుంటల భూమి వేరే వ్యక్తి పేరు మీద బదిలీ అయ్యింది. ఎలా బదిలీ అయ్యిందో తెలియదు కానీ ఇద్దరి మధ్య ఆ భూమి విషయంలో గొడవలు జరిగాయి. 2016లో పోలీస్‌ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఆ తర్వాత కోర్టుకు కూడా వెళ్లారు. అయితే ఆ భూమి వేరే వ్యక్తికి చెందుతుందంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో జవాన్‌ స్వామి... తన తండ్రి భూమిని భయభ్రాంతులకు గురి చేసి వేరే వ్యక్తి పేరు మీద బదలాయించారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇలా సెల్ఫీ వీడియో తీసి పెట్టాడు. ఈ ఘటనపై తన తండ్రి కూడా కుమిలిపోతున్నాడు.

జవాన్లు సరిహద్దుల్లో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి డ్యూటీ చేస్తుంటారు. తమ ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి విధి నిర్వహణలో పాల్గొంటారు. అలాంటి వారి భూమికే రక్షణ లేకపోతే ఎలాగన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. కొందరు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రధానికి దృష్టికి, హోంమంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు. సోషల్‌ మీడియాలో సెల్ఫీ వీడియో వైరల్‌గా మారడంతో సైనికాధికారులు స్పందించారు. సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఏప్రిల్‌ 30న సైనికాధికారులు లేఖ రాయగా.. అది మే 7న జిల్లా కలెక్టర్‌కు చేరింది. దీంతో స్పందించిన కలెక్టర్‌.. డిజిటల్ పాస్‌ బుక్కుల జారీని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు. మొత్తాని ఆర్మీ జవాన్‌ సెల్ఫీ వీడియో చర్చనీయాంశంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story