ఆ రాష్ట్రంపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి

ఆ రాష్ట్రంపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
X

అఖండ మెజారిటీని అందించిన యూపీపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారు. నీటి సమస్యను తీర్చి 2022 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలన్నది కమలనాథుల వ్యూహం. అసెంబ్లీ ఎన్నికలకంటే ఏడాది ముందుగానే యూపీలో నీటి సమస్యను పరిష్కరించాలని ప్రధాని మోదీ యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు సూచించారు. యూపీ నీటి ప్రాజెక్టుల కోసం 9 వేల కోట్లను మోదీ ప్రభుత్వం విడుదల చేయనుంది. వీటితో నీటి సమస్య తీవ్రంగా ఉన్న బుందేల్‌ఖండ్‌, విద్యాంచల్‌ ప్రాంతాల్లో నీటి సమస్యను తీర్చనున్నారు.

నీటిని భద్రపరిచే చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ కొద్ది రోజుల కిందటే యూపీ సర్పంచ్‌లకు లేఖలు రాశారు ఇప్పుడు యూపీ మొత్తం నీటి సమస్యపై దృష్టి సారించారు. అందులో భాగంగానే యూపీ సీఎం యోగితోపాటు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌కు సూచనలు చేశారు. 2021 నాటికి యూపీ నీటి సమస్యలేకుండా చూడాలని మోదీ స్పష్టం చేశారు. 20 కోట్ల జనాభా ఉన్న యూపీలో ఎన్నికల ఏడాదికి ముందుగానే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నీటి సమస్య తీర్చాలన్నది టార్గెట్.

తాజాగా కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్ర షెఖావత్‌తో యూపీ సీఎం భేటీ అయి నీటి ప్రాజెక్టులపై చర్చించారు. నీటి యుద్ధాలు జరిగే బుందేల్‌ఖండ్‌ లాంటి ప్రాంతంపై ముందుగా దృష్టి పెట్టనున్నారు. వీటితోపాటు మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గ పరిధిలోని సోన్‌భద్ర, మిర్జాపూర్‌ ప్రాంతాల్లోనూ స్పెషల్ కేర్ తీసుకుంటారు. గంగా, యమున లాంటి ముఖ్య నదుల్లో పూడిక తీసి... ఎలాంటి ఆటంకం లేకుండా నీటి ప్రవాహం కొనసాగేలా చర్యలు తీసుకోనున్నారు. అటు గంగానదిలో కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలపైనా యోగీ ప్రత్యేక దృష్టి సారించారు.

యూపీ నీటి వనరులు గ్రామీణ అభివృద్ధి శాఖ, ఇరిగేషన్‌, జల్ నిగమ్‌ మంత్రిత్వశాఖల కింద ఉన్నాయి. గతంలో ములాయం సింగ్‌ యాదవ్‌ సోదరుడు శివపాల్‌ యాదవ్‌ ఇరిగేషన్‌ శాఖ బాధ్యతలు చూశారు. పేరుకు శివపాల్‌ మంత్రి అయినప్పటికీ... ఆజం ఖాన్‌ కనుసన్నుల్లోనే వ్యవహారాలన్నీ నడిచేవి. ఆయన హయాంలో ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. అవినీతి ఇంజినీర్లు, అధికారులపై యోగి సర్కార్‌ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ప్రజల నీటి కష్టాలు పెరిగి పరిస్థితి మరింత దిగజారకముందే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని యోగీకి మోదీ దిశానిర్దేశం చేస్తున్నారు.

Next Story

RELATED STORIES