భారీ భూకంపం.. 150 మంది..

వరుస భూకంపాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న చైనాను మరోసారి భూకంపం వణికించింది. సిచువాన్ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైంది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా... 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాత్రి ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం ఇంట్లో నుంచి బయటకు పరుగుల తీశారు. పలు ప్రాంతాల్లో భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
సుమారు 30 నిమిషాల పాటు భూమి కంపించగా... సిచువాన్ రాజధాని చెంగ్దూ, చాంగ్‌నింగ్ నగరాలు షేక్ అయ్యాయి. దీంతో జనాలంతా రోడ్లపైకి పరుగులు తీశారు. భూమి మొత్తం రెండు సార్లు కంపించగా.. ఒకసారి 5.9... మరోసారి5.2 తీవ్రతగా రిక్టర్ స్కేలుపై నమోదైంది. చాంగ్‌నింగ్ సమీపంలోని 10 కిలో మీటర్ల దూరంలో ఈ భూకంపం కేంద్రీకృతమై ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే స్పష్టం చేసింది.
రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. భవనాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. సిచువాన్ ప్రావిన్స్‌లో తరచుగా భూప్రకంపనలు సంభవించడం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. 2008 మేలో ఇక్కడ వచ్చిన భూకంపంతో సుమారు 70వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com