మోదీ కొత్త సంప్రదాయం.. సీనియర్లు ఉన్నా.. వారిని కాదని..

మోదీ కొత్త సంప్రదాయం.. సీనియర్లు ఉన్నా.. వారిని కాదని..
X

లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ తరఫున రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఓం బిర్లా ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ పదవికి ఎన్డీయే అభ్యర్థిగా బిర్లాను ఖరారు చేసిన బీజేపీ.. ఆ మేరకు ఆయన పేరును ప్రతిపాదించింది. లోక్‌సభ సెక్రటేరియట్‌కు నోటీసు ఇచ్చింది. ఏఐఏడీఎంకే సహా ఎన్డీయే పక్షాలు, వైఎస్సార్‌సీపీ, బిజూ జనతాదళ్‌ ఈ తీర్మానానికి మద్దతు పలికాయి. మరో నామినేషన్ కూడా లేకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది.

లోక్ సభలో ఎన్డీయేకి పూర్తి మెజారిటీ ఉండటం, అంతేగాక యూపీఏ పక్షాలు సైతం బిర్లాకే మద్దతు ప్రకటించడంతో స్పీకర్‌గా ఆయన ఎన్నిక లాంఛనం అయింది. కాంగ్రెస్‌తో పాటు మిగతా యూపీఏ పక్షాలు ఎన్డీయే అభ్యర్థికే మద్దతు పలకాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి స్పష్టం చేశారు. సాయంత్రం జరిగిన యూపీఏ పక్షాల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. డిప్యూటీ స్పీకర్‌ అంశంపై మాత్రం ఆయన మౌనం వహించారు. కాంగ్రెస్, విపక్షాలు దీనిపై వేచి చూసే ధోరణిలో ఉన్నాయి.

స్పీకర్‌గా ఓం బిర్లా పేరును ప్రధాని మోదీ ప్రతిపాదించారు. వరసగా రెండోసారి అధికారం చేపట్టిన ఉత్సాహంలో ఉన్న మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాలు మరోసారి తమ మార్క్‌ ప్రదర్శించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీలో, చట్టసభల్లో కురువృద్ధులకు స్థానం ఉండదన్న సంకేతాలు ఇచ్చారు. 17వ లోక్‌సభకు స్పీకర్‌గా బిర్లాను ఎంపిక చేయడం ద్వారా బలంగా పంపారని అంటున్నారు. అలాగే పైకి కన్పించకపోయినా క్షేత్ర స్థాయిలో బాగా పనిచేసేవారికి పార్టీ ప్రాధాన్యమిస్తుందనడానికి కూడా ఇది సంకేతమని చెబుతున్నారు.

సాధారణంగా లోక్‌సభ స్పీకర్‌ పదవి విషయంలో సీనియర్‌ నేతలను పరిగణనలోకి తీసుకుంటారు. కానీ రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన వారూ ఈ పదవిని చేపట్టిన సందర్భాలు గతంలో ఉన్నాయి. 2002లో స్పీకర్‌గా ఎన్నికైనా శివసేన ఎంపీ మురళీ మనోహర్‌ జోషి అప్పుడు తొలిసారి ఎంపీగా గెలిచారు. ఆయన తర్వాత ఆ పదవి చేపట్టిన జీఎంసీ బాలయోగి అప్పటికి రెండుసార్లు మాత్రమే ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు బిర్లా కూడా కేవలం రెండుసార్లు ఎంపీగా గెలిచారు. చాలామంది సీనియర్లు ఉన్నా.. కాదని.. ఆయనకు అవకాశం ఇచ్చారు.

Next Story

RELATED STORIES