తెలంగాణలో మరో మహోన్నతమైన ఘట్టం..

తెలంగాణలో మరో మహోన్నతమైన ఘట్టం..

తెలంగాణలో ఓ మహోన్నతమైన అద్బుత ఘట్టానికి సర్వం సిద్ధమవుతోంది.. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ అయిన కాళేశ్వరం.. శుక్రవారం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంపుహౌస్ వద్ద చకచకా ఏర్పాట్లు పూర్తవుతున్నా యి. హోమశాలలు, హెలిప్యాడ్లు, రహదారు లు, శిలాఫలకాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకమై ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఉమ్మడి రాష్ర్టాల గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, ఇరురాష్ట్రాల సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరుకాన్నారు. ఇప్పటికే వీరందరిని స్వయంగా కలుసుకోని ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆహ్వానించారు.

తొలుత సీఎం కేసీఆర్‌తోపాటు ముఖ్యఅతిథులు మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకొని అక్కడ నిర్వహించే హోమంలో పాల్గొని బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తారు. అనంతరం కన్నెపల్లి పంప్‌హౌస్ వద్దకు చేరుకుని అక్కడ మరో హోమాన్ని నిర్వహించిన తర్వాత పంప్‌హౌస్‌లోని మోటర్ల వెట్‌ రన్‌ ప్రారంభిస్తారు. అటు మేడిగడ్డ బ్యారేజీ వ్యూపాయింట్ వద్ద హోమశాల నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. మేడిగడ్డ, కన్నెపల్లి దగ్గర శిలాఫలకాలను ఏర్పాటుచేస్తున్నారు. ముఖ్యఅతిథుల రాకపోకల కోసం మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఏడు, కన్నెపల్లి వద్ద ఆరు హెలిప్యాడ్‌లను సిద్ధం చేస్తున్నారు. వర్షం పడితే ఇబ్బంది కలుగకుండా హెలిప్యాడ్ల నుంచి హోమశాల, బ్యారేజీ గేట్ల వరకు బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజున గ్రామ గ్రామాన సంబరాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చింది టీఆర్‌ఎస్‌. సీఎం కేసీఆర్ ప్రాణం పెట్టి ప్రాజెక్టు పనులను వేగంగా చేయించారని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు.. ప్రతి రైతు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిస్తున్నారు.

మరో వైపు కాళేశ్వరం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉండటం, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడం వల్ల మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్ ప్రాంతాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రారంభోత్సవం జరిగే ప్రాంతం చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిని తమ ఆధీనంలోకి తీసుకున్న గ్రేహౌండ్స్‌ బలగాలు ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. వీరికి అదనంగా ఆక్టోపస్‌ కమెండోలను, నాలుగు వేల మంది సిబ్బందిని పోలీస్‌ శాఖ కీలకమైన ప్రాంతాల్లో మోహరించింది.. ఆయా ప్రాంతా ల్లో డ్రోన్ కెమెరాలు, వాహన తనిఖీలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

కాళేశ్వరం ప్రాంగణమంతా తాత్కాలిక ప్రాతిపదికన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. సున్నిత ప్రాంతం కావడంతో భద్రతా కారణాలరీత్యా వీలైనంతవరకు ముఖ్యమంత్రులతోపాటు ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులను హైదరాబాద్‌ నుంచి కాళేశ్వరానికి హెలికాప్టర్లలోనే తరలించాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం కాళేశ్వరం ప్రాజెక్టు పరిసరాల్లో దాదాపు 12 హెలిప్యాడ్లను సిద్ధం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story