మనిషికాదు.. మానవమృగం..

మనిషికాదు.. మానవమృగం..
X

తొమ్మిది నెలల పసిబిడ్డను చూసిన ఎవరికైనా ఏమనిపిస్తుంది..? అక్కున చేర్చుకొని లాలించాలనిపిస్తుంది.. అమాయక చూపులు.. ఆ బోసినవ్వులను చూస్తూ లోకాన్నే మరచిపోవాలనిపిస్తుంది.. ఈ పసిబిడ్డలో ఇంతకంటే ఏం కనిపిస్తుంది..?

ఈ మృగాడికి మాత్రం ఈ చిన్నారిలో కనిపించింది పసితనం కాదు.. ఆడతనం.. పసికందు గురించి ఇలాంటి మాట వాడాల్సి రావడం బాధ కలిగిస్తున్నా.. చెప్పడానికి మనసు రాకపోతున్నా.. ఈ మృగాడి పైశాచికత్వం గురించి చెప్పడానికి ఈ పదాలు వాడక తప్పడం లేదు.. వావీ వరసలు మరచిపోయి మదమెక్కిన మనిషి పాల్పడిన దారుణానికి చిన్నారి కాలిపై కనిపిస్తున్న రక్తపు ధారలే సాక్ష్యం..

మనిషి తోలు కప్పుకున్న ఈ మృగం చిన్నారి జీవితాన్ని చిదిమేసింది.. తనపై జరుగుతున్న అకృత్యాన్ని ఆపలేక.. వీడిలాంటి నరరూప రాక్షసుల మధ్య బతకలేక ఈ చిట్టితల్లి ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయింది.. అసలు వీడు మనిషేనా..? మృగాలు కూడా ఇలాంటి పని చేయవు.. తలుచుకుంటేనే వణుకు పుడుతోంది.. ఈ చిన్నారి ఉదంతాన్ని తలుచుకుంటుంటే కన్నీళ్లు ఆగడం లేదు.. ఇంతటి విష సంస్కృతి అల్లుకుపోయిన సమాజంలోనా మనం బతుకుతోంది అనిపిస్తోంది.. ఆడజన్మ ఎత్తిన పాపానికి తన బిడ్డకు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రతి కన్న హృదయం భయపడుతూ బతకాల్సిందేనా..? ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టినట్టుగా భావించే తల్లిదండ్రులు కూడా భయపడే పరిస్థితి కలుగుతోంది ఈ ఉన్మాద చర్యను చూస్తుంటే..! తొమ్మిది నెలల పసికందుపై అత్యాచారం చేసి అమానుషంగా చంపేసిన ఈ ఘటన వ్యవస్థలోని మనిషితనాన్ని ప్రశ్నిస్తోంది.. సమాజంలో పైశాచికత్వం ఏ స్థాయిలో ఉందో చెబుతోంది..

వరంగల్‌లో చిన్నారి జీవితాన్ని చిదిమేసిన ఉన్మాది వంటి మృగాళ్లు కొందరు విజయవాడలో ఓ పండు ముసలి అవ్వపై అత్యాచారానికి పాల్పడ్డారు.. ఇదుగో.. ఈమే ఆ బాధితురాలు.. ఈ వయసులో ఈమెకు చేతనైతే సాయం చేయాలి.. అండగా నిలబడాలి.. ఆదుకోవాలి.. కానీ, మనిషి తోలు కప్పుకున్న తోడేళ్లు కొన్ని ఈ అభాగ్యురాలిపైనా అత్యాచారానికి ఒడిగట్టారు.. ఈ రెండు ఘటనలు సమాజంలో మరుగున పడిపోయిన మానవత్వానికి అద్దం పడుతున్నాయి.. ఇవేకాదు, ఇంకా బయటకు రాని సంఘటనలు ఎన్నో ఉన్నాయి.. చట్టాలెన్ని వున్నా ఆడ పిల్లలను కాపాడలేని పరిస్థితి నెలకొంది.

ఇదేనా మన భారత దేశం..? ఈ దేశంలో ఆడపిల్లగా పుట్టకూడదని భారతమాతే శోకించేంతగా మారిన ఈ పరిస్థితులకు కారణం ఎవరు..? ఈ ఘటనలు చూస్తుంటే అసలు మనం మానవ ప్రపంచంలోనే బతుకుతున్నామా అనే అనుమానం కలుగుతోంది. జంతువులు కూడా సాటి జంతువులను ఏమీ చేయవు.. కానీ, మగాళ్లు మాత్రం ఆడపిల్ల కనిపిస్తే కళ్ల నిండా కామాన్ని నింపుకుని చూస్తున్నారు. ఆడపిల్ల ఒంటరిగా కనిపించడమే పాపం.. మగాడు మృగాడిలా మారుతున్నాడు.. వయసుతో సంబంధం లేకుండా తన ఉన్మాదత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు..

రోజురోజుకూ ఆడపిల్లల పరిస్థితి మరింత దిగజారుతోంది. బేటీ బచావో.. బేటీ పడావో అంటూ పాలకులు చెబుతుంటే.. ఇలాంటి మృగాళ్లకు మాత్రం ఈ నీతి సూక్తులు మరోలా వినబడుతున్నాయి.. ఈ దేశంలో పసిబిడ్డల నుంచి పండు ముసలి వారి వరకు ఎవరికీ రక్షణ లేదని ఈ రెండు ఉదంతాలు గుర్తు చేస్తున్నాయి.. మనం ఎక్కడికి వెళ్తున్నాం..? లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలు.. వీటికి అంతం ఎక్కడ..? నిర్భయ లాంటి కఠినమైన చట్టాలు వచ్చినా ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయంటే లోపం ఎక్కడుంది..? చట్టాలను పకడ్బందీగా అమలు చేయగలిగినప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది.. ఆడబిడ్డలపై అకృత్యాలకు పాల్పడే కిరాతకులకు చట్టంలో లొసుగులు అండగా నిలబడ్డప్పుడు సమాజంలో మార్పు వస్తుందని ఆశించడం అత్యాశే అవుతుంది.

తెలుగు రాష్ట్రాలను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నామనే పాలకులారా.. ఈ దారుణాలను చూస్తున్నారా..? చూస్తూనే ఊరుకుంటారా..? ఇలాంటి ఘోరాలను చేసే వారిని నడిరోడ్డు మీద నరికి చంపాలని, ఉరితీయాలని అంతా డిమాండ్‌ చేస్తున్నారు.. ఇలాంటి కఠిన శిక్షలు విధించడం ద్వారా మరెవరూ ధైర్యం చేయలేరని.. సమాజంలో మార్పు కనబడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.. నిజమే, కఠిన శిక్షలు అమలు చేయాల్సిందే.. నేరం రుజువైన మరుక్షణం మృగాడికి శిక్ష పడేలా చేస్తే ఆ భయంతో ఇలాంటి ఘటనలు కొంతైనా తగ్గే అవకాశం లేకపోలేదు.

కఠిన శిక్షలు విధించడం లేదని ప్రభుత్వాలను నిందించే ముందు సమాజంలో మార్పు కోసం మనమేం చేయాలనే ఆలోచన రావాలి. మన చుట్టూ ఏం జరుగుతోందో గమనించాలి. ఒక కాకి ఆపదలో ఉంటే వంద కాకులు పోగవుతాయి.. దానిని రక్షించుకునేందుకు వాటి ప్రాణాలను ఫణంగా పెడతాయి.. కనీసం ఆపాటి జ్ఞానం కూడా మనుషులకు లేకుండా పోతోంది.. చుట్టుపక్కల ఏం జరుగుతోందో పట్టించుకునే పరిస్థితి కూడా లేకుండా పోతోంది.. ప్రతి ఒక్కరిలోనూ స్వార్థమే కనబడుతోంది.. ఈ స్వార్థం వికృతరూపం దాల్చుతున్న నేటి సమాజంలో మానవత్వం దొరుకుతుందని భావించడం భ్రమే అవుతుంది.

Next Story

RELATED STORIES