తాజా వార్తలు

అందని ద్రాక్షగా అడవిపుత్రుల అభివృద్ధి

అందని ద్రాక్షగా అడవిపుత్రుల అభివృద్ధి
X

నాగర్‍ కర్నూల్‍ జిల్లా పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో నివాసముంటున్న అడవిపుత్రుల అభివృద్ధి అందని ద్రాక్షగా మారింది. నాడు ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో అడవి బిడ్డలను పట్టించుకున్న నాథుడే కరువైపోయాడు. అడవినే నమ్ముకున్న చెంచుల కోసం గూడు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినా అధికారులు అడ్డుపుల్ల వేయడంతో ఆ పథకం ముందుకు కదలలేదు.

జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో 18 చెంచు పెంటలుండగా అందులోని 12 వందల కుటుంబాలకు పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆర్‍డిటీ పథకం కింద 12 వందల కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి సర్వం సిద్ధం చేసింది. మొదటి దశకింద 6 చెంచు పెంటల్లో ఇళ్లు నిర్మించింది ప్రభుత్వం. రెండోదశ కింద మిగిలిన 12 చెంచుపెంటల్లోనూ ఇళ్లు కట్టించేందుకు ఆరు నెలల క్రితం శ్రీకారం చుట్టింది.. అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసింది. దీంతో త్వరలోనే తమకు గూడు దొరుకుతుందని అడవిబిడ్డలు సంతోషించారు.. కానీ, అధికారులు మధ్యలో వేలు పెట్టడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి..

ఆర్‍డిటీ పథకం కింద ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైతే.. నల్లమల అటవీ ప్రాంతంలో కొత్తగా నిర్మాణాలు చేపట్టకూడదంటూ అటవీ అధికారులు అడ్డం పడ్డారు. దీంతో రెండు కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన సామగ్రి ఉపయోగం లేకుండా పడుంది.. అటవీ అధికారులు చెంచులను అడవిలోంచి వెళ్లగొట్టాలనే ఉద్దేశంతోనే నిర్మాణాలు అడ్డుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. కొత్త ఇళ్లు వస్తున్నాయన్న సంతోషంతో ఉన్న గుడిసెలను కూడా కూల్చేసుకున్నామని.. వర్షాకాలంలో నిలువ నీడ లేకుండా చేశారని వారు వాపోతున్నారు.

ఇన్నాళ్లు మావోయిస్టుల ప్రాబల్యం పేరుతో అభివృద్ధిని అడ్డుకున్న అధికారులు.. ఇప్పుడు అడవినే నమ్ముకున్న తమను ఇక్కడ్నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెంచులు వాపోతున్నారు. తమ వల్లే ఇంకా అడవుల్లో వణ్యప్రాణులు స్వేచ్ఛగా తిరగ గలుగుతున్నాయని.. ఇప్పటికైనా అటవీ అధికారులు మానవత్వంతో ఆలోచించి ఇళ్ల నిర్మాణం జరిగేలా చూడాలని వారంతా కోరుతున్నారు.

Next Story

RELATED STORIES