అరబకెట్‌ నీళ్ల కోసం అరగంట వెయిట్ చేశా : ఎస్పీ బాలు

అరబకెట్‌ నీళ్ల కోసం అరగంట వెయిట్ చేశా : ఎస్పీ బాలు

వారానికి రెండు జతల బట్టలు వేసుకోండి. రోజూ బట్టలు మార్చితే చాలా కష్టం. చెన్నైలో నీటికష్టాలపై ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు చేసిన కామెంట్స్‌ ఇవి. చెన్నై నీటి సమస్యను స్వయంగా తానూ అనుభవించానని బాలు తెలిపారు. స్నానం చేద్దామంటే నీళ్లు లేవని, అర బకెట్ నీళ్ల కోసం అరగంట పాటు వేచి చూడాల్సి వచ్చిందన్నారు బాలు. గూర్ఖా అనే తమిళ సినిమా ఆడియో ఫంక్షన్ లో పాల్గొన్న బాలు.. చెన్నైలో ప్రస్తుత పరిస్థితిని అధిగమించాలంటే నీటి పొదుపును పాటించాలన్నారు. బంగారం, ప్లాటినం కన్నా నీరు విలువైనదని అన్నారు బాలు. నగరంలో నీటి ఎద్దడికి మనమే కారణమన్నారు.

ప్లేట్లలో తినే బదులు విస్తరాకుల్లో తింటే నీరు ఆదా అవుతుందని బాలు వ్యాఖ్యానించారు. ప్రతిరోజూ బట్టలను మార్చే బదులు, వారంలో రెండు జతలు మాత్రమే ధరిస్తే, ఉతికేందుకు ఖర్చయ్యే నీరు మిగులుతుందన్నారు ఎస్పీ. మొత్తానికి చెన్నైలో నీటి కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. వర్షాల్లేక దేశంలోని అనేక ప్రాంతాల్లో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు. తమిళనాడులో తాగునీటి కష్టాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. నల్లాల్లో నీరు రాకపోవడంతో... ట్యాంకర్లు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు కంటిమీద కునుకు లేకుండా ఎదురుచూస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story