గుండెపోటుతో టీడీపీ సీనియర్ నేత మృతి

తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, NTR ట్రస్ట్ భవన్ ఇన్‌ఛార్జ్ జి.బుచ్చిలింగం గుండెపోటుతో కన్నుమూశారు. నిన్న రాత్రి 12 గంటలకు ఆయన తుదిశ్వాశ విడిచారు. అన్న నందమూరి తారకరామారావు హయాం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించిన బుచ్చిలింగం మరణం పట్ల టీడీపీ నేతలు దిగ్భాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం ఆయన పార్టీకి అందించిన సేవల్ని కొనియాడారు. అప్పట్లో మున్సిపల్ ఛైర్మన్‌గా పోటీ చేసిన బుచ్చిలింగం కోసం స్వయంగా NTR ప్రచారంలోకి దిగారు. "ఈయన బుచ్చిలింగం కాదు.. నా ఆత్మలింగం.." నన్ను చూసి ఓటు వేసి గెలిపించండని కోరారు. ఆ ఎన్నికల్లో బుచ్చిలింగం ఘన విజయం సాధించారు. ఎన్టీఆర్‌కి అత్యంత సన్నిహితులైన వ్యక్తుల్లో బుచ్చిలింగం ఒకరు. తర్వాత చంద్రబాబు అధ్యక్షతన కూడా పార్టీ బలోపేతం చేసే అంశాల్లో.. క్రియాశీలక పాత్ర పోషించారు. NTR ట్రస్ట్‌భవన్‌లో వివిధ జిల్లాల పరిశీలకునిగానూ.. రాష్ట్ర కార్యక్రమాల కమిటీ సభ్యుడిగానూ ఆయన సేవలు అందించారు. రామారావుకు ఆత్మబంధువుగా పేరు తెచ్చుకుని.. క్రమశిక్షణతో అంకింత భావంతో పనిచేశారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టించి పనిచేసిన బుచ్చిలింగం మరణం పట్ల తెలుగుదేశం నేతలంతా సంతాపం తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com