అడవితల్లి ఉండమంటుంది... అధికారులు పొమ్మంటున్నారు

అడవితల్లి ఉండమంటుంది... అధికారులు పొమ్మంటున్నారు

వారిని అడవితల్లి ఉండమంటుంది... అదికారులు పొమ్మంటున్నారు. వారు చెయ్యరు.. ఇంకొరిని చెయ్యనివ్వరు.. ఎన్నో ఏళ్ళుగా అడవినే నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న అడవి పుత్రుల అభివృద్దిని అడుగడుగునా ఫారెస్టు అధికారులు ఆటంకాలు సృష్టిస్తున్నారు. అడవిలో ఆకులు, అలములే నమ్ముకుని, గూడులేని పేదల పట్ల కనికరం ఏది?

నాగర్‍ కర్నూల్‍ జిల్లా పరిధిలోని నల్లమల అటవీ ప్ర్తాంతంలో నివాసముంటున్న అడవిపుత్రులకు అభివృద్ది అందని ద్రాక్షగానే మారింది. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. కనీస సదుపాయాలకు నోచుకోవడం లేదు..

నల్లమలలోని 18 చెంచుపెంటలున్నాయి. వారి అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. 12 వందల కుటుంబాలకు పక్కా ఇళ్ళ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆర్‍డిటీ పథకం కింద ఈ 12 వందల కుటుంబాలకు ఇళ్ళ నిర్మాణానికి సర్వం సిద్దం చేశారు. మొదటి దశకింద 6 చెంచు పెంటల్లో ఇళ్ళ నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. రెండోదశ కింద మిగిలిన 12 చెంచుపెంటల్లోను ఇళ్ళ నిర్మాణం ఆరు నెలల క్రితం మొదలుపెట్టారు. ఇళ్ళ నిర్మాణానికి కావాల్సిన కోట్ల రూపాయల సామాగ్రిని కొనుగోలు చేసి ఆయా గ్రామాలకు తరలించారు. ఇళ్ళ నిర్మాణ పనులను సైతం ప్రారంబించారు. త్వరలోనే సొంతింటి కల నెరవేరుతుందని అడవిబిడ్డలు ఆశించారు. కానీ ఆశలను ఫారెస్టు అధికారులు ఆవిరిచేశారు..

ఆర్‍డిటీ పథకం కింద ఇళ్ళ నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు కేటాయించారు. అదికారులు కూడా ఆఘమేగాల మీద పనులు ప్రారంబించారు. ఇంతలోనే నల్లమల అటవీ ప్రాంతంలో కొత్తగా ఇళ్ళ నిర్మాణాలు చేపట్టరాదంటూ ఫారెస్టు అదికారులు మోకాళ్ళడ్డారు. దీంతో ఎక్కడిపనులు అక్కడే ఆగిపోయాయి. 2 కోట్లు పెట్టి కొనుగోలుచేసిన సామాగ్రి నిరుపయోగంగా మారింది. ఇనుము, ఇసుక, సిమెంటు, ఇటుక నేలపాలయ్యాయి. తమను అడవిలోనుంచి వెళ్ళగొట్టాలన్న ఉద్దేశ్యంతో ఇళ్ళ నిర్మాణాలు అడ్డుకున్నారని చెంచులు ఆరోపిస్తున్నారు. తాము అడవిలో ఉండడం వల్లే వన్య ప్రాణులు, ఇతర ప్రాణులు స్వేచ్చగా తిరుగుతున్నాయంటున్నారు. తమకు ఇళ్ళు నిర్మాణమౌతున్నాయని సంతోషంలో గుడిసెలను కూడా తొలగించుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గుడిసెలు లేదు.. కొత్త ఆవాసాలు కట్టలేదు.. వర్షాకాలం ప్రారంభమైందని ఇప్పుడు మా పరిస్థితి ఏంటని చెంచులు ప్రశ్నిస్తున్నారు.

అమ్మపెట్టదు అడుకుతిన్నవ్వద్దు అన్న చందంగా మారింది నాగర్‍ కర్నూల్‍ జిల్లాలోని నల్లమల అడవి పుత్రుల పరిస్థితి. ఇన్నాళ్ళు మావోయిస్టుల ప్రాభల్యం కారణంగా తమ అభివృద్దిని అడ్డుకున్నారని, ఇప్పుడు ఏకంగా తమను అడవిలో నుంచి పంపించేందుకే ఫారెస్టు అధికారులు నడుం బిగించారని చెంచులు ఆరోపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story