పైశాచికం.. విమానంలో ఆక్సిజన్ నిలిపివేసి 238 మంది ప్రాణం తీశాడు

పైశాచికం.. విమానంలో ఆక్సిజన్ నిలిపివేసి 238 మంది ప్రాణం తీశాడు

ఏదైనా వాహనం ఎక్కితే ఎంచక్కా నిద్రలోకి జారుకుంటాం. మొత్తం భారం డ్రైవర్ మీద వేసేసి డీప్ స్లీప్‌లోకి వెళ్లిపోతాం. మనం చేరుకోవలసిన గమ్యస్థానం వచ్చిందని డ్రైవర్ చెప్పే వరకు తెలియదు. అలాగే నిద్ర పోయారు విమానంలో ప్రయాణం చేసే 238 మంది ప్రయాణీకులు. వారి ప్రాణాల్ని అనంత వాయువుల్లో కలిపేశాడు పైలెట్ ఆక్సిజన్ ఆపేసి. ఆ తరువాత ఆ విమానాన్ని గుర్తు తెలియని ప్రాంతంలో కూల్చేశాడు. అచ్చంగా హాలీవుడ్ సినిమాని తలపిస్తున్న ఈ ఘటన 2014 మార్చి 8వ తేదీన జరిగింది. ఆచూకీ లేకుండా పోయిన MH370 మలేషియా విమానం వెనుక దాగిన మిస్టరీని ఛేదించేందుకు ఏర్పాటైన నిపుణుల కమిటీ ఇటీవల కొన్ని విషయాలను వెల్లడించింది. కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు వెళ్తున్న MH370 విమానం అకస్మాత్తుగా మాయమవడం అధికారులను ఇబ్బంది పెట్టింది. విమానం ఆచూకీ లేకుండా పోవడానికి కారణం పైలెట్ జహారీ అహ్మద్ షా అని నిర్ధారించారు. ప్రమాదం జరిగిన తరువాత పైలెట్ స్నేహితుల్ని, బంధువులను విచారిస్తే ఆయన గురించిన కొన్ని విషయాలు వెల్లడయ్యాయి. పైలెట్ డిప్రెషన్‌తో బాధపడుతున్నందువల్లే విమానం ప్రమాదానికి గురైనట్లు టీమ్ నిర్ధారణకు వచ్చింది.

ఒంటరితనం అనుభవిస్తున్న పైలెట్ కావాలనే 40 వేల అడుగుల ఎత్తులోకి విమానాన్ని తీసుకువెళ్లి, ఆ తర్వాత క్యాబిన్‌లో ఆక్సిజన్ తగ్గించి ప్రయాణీకులను హత్య చేసి ఉంటాడని నిపుణులు భావిస్తున్నారు. ఆ తర్వాత విమానాన్ని సముద్రంలోకి పోనిచ్చి ఉంటాడన్నారు. ఆక్సిజన్ అందక ప్రయాణీకులు ఊపిరి ఆడలేదని.. దీంతో బంధువులకు కూడా సమాచారం అందించలేకపోయారని నిపుణుల బృందం తెలిపింది.ప్రమాదానికి ముందు విమానం బీజింగ్ వైపు వెళ్లాల్సింది. కానీ ఒక్కసారిగా గాల్లో 40 వేల ఎత్తుకు ఎగిరి అక్కడి నుంచి యూ టర్న్ తీసుకుంది. ఆ తర్వాత విమానం ఎక్కడ కూలింది అనేది స్పష్టత లేదు. అయితే, ఇటీవల ఆ విమానానికి సంబంధించిన శకలాలు దొరికినట్టు సమాచారం వచ్చినా.. ఖచ్ఛితంగా విమానం ఎక్కడ కూలిందో తెలుసుకోలేకపోతున్నారు అధికారులు. విమానంకు సంబంధించిన బ్లాక్ బాక్స్ లభించేవరకు ప్రమాదం మిస్టరీ వీడేలా లేదని 'ది సన్' వెబ్‌సైట్ వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story