Top

వెంకన్న దర్శనం ఇక అంత ఈజీ కాదు

వెంకన్న దర్శనం ఇక అంత ఈజీ కాదు
X

సప్తగిరీశ్వరుని భక్తుడికి కొత్త ఆటంకాలు...ఇక ఏడుకోండల వెంకన్న దర్శనానికి వెళ్ళాలంటే సరికొత్త నిబంధనలు పాటించాల్సిందేనా.? శేషాచలం కనుమల్లో ప్రయాణించే వాహనదారులకే కాదు.. కాలినడక ద్వారా వచ్చే భక్తులకు కూడా హద్దులు గీస్తున్నారా? భధ్రత పేరుతో భక్తులపై పెరుగుతున్న ఆంక్షలేంటి? ప్రతిపాదనలపై భక్తుల అభిప్రాయాలు తీసుకున్నారా? ఒక వైపు వన్యప్రాణుల సంరక్షణ..మరో వైపు భక్తుల మనోభవాలు మధ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు?

కొండలలో నెలకొన్న కోనేటి రాయుని దర్శనార్థం భక్తులు వేల సంఖ్యలో తిరుమలకు వస్తుంటారు. వారాంతపు దినాలలో అయితే లక్షకు పైమాటే. రెండు ఘాట్ రోడ్లలో ఉదయం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు ద్విచక్ర వాహనాలను అనుమతిస్తారు. కార్లు, జీపులు, బస్సులను వేకువజాము 3 నుంచి అర్ధరాత్రి 12 వరకు అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో నిరంతరాయంగా నడుచుకుంటూ భక్తులు తిరుమలకు చేరుకుంటారు. శ్రీవారి మెట్ల మార్గంలో మాత్రం ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 6 వరకు భక్తులను అనుమతిస్తారు. అయితే తాజాగా అధికారులు నిబంధనలు పెడుతూ ప్రతిపాదలను సిద్దం చేశారు. తరచు ఘాట్ రోడ్లలో చిరుత సంచరించడమే కాకుండా... తిరుపతి నుండి తిరుమలకు వస్తున్న పలువురిపై దాడి చేసిన సంఘటన తాజాగా చోటు చేసుకొంది. ప్రత్యేక పరిస్థితులు దృష్ట్యా టీటీడీ విజిలెన్స్, అర్బన్ పోలీస్ మరియు టీటీడీ ఫారెస్ట్ అధికారులతో గవర్నమెంట్ ఫారెస్ట్ అధికారులు భేటి అయ్యారు. వారి ముందు ఘాట్ రోడ్లలో కొన్ని నియమాలను అమలు చేయాలని ప్రతిపాదనలు పెట్టారు. ఓ కమిటీ వేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని టీటీడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తొమ్మిది అంశాలతో కూడిన ప్రతిపాదనలు టీటీడీ విజిలెన్స్.., అర్బన్ పోలీసుల ముందుంచింది. ఇందులో సాయంత్రం 7 నుంచి ఉదయం 6 వరకు ద్విచక్ర వాహనాలను అనుమతించరాదనే ప్రతిపాదనుంది. అయితే స్థానికులు, టీటీడీ ఉద్యోగులు, వ్యాపారులు ద్విచక్ర వాహనాల్లో విధులకు వెళుతుంటారు.. రాత్రి పది గంటల వరకు కూడా ద్విచక్ర వాహనాల రాకపోకలుంటాయి. ఇది అమలు చేయడంలో ఇబ్బందులున్నాయన్న చర్చ జరుగుతోంది. నడక మార్గం రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేయలని కూడా సూచన చేశారు. ఇక నడక దారిలో అర్ధరాత్రి వరకు కూడా భక్తులు ప్రయాణిస్తుంటారు. వాతావరణం చల్లగా ఉంటుందన్న కారణంగా ఉదయం, సాయంత్రం పూట నడవడానికి భక్తులు ఆసక్తి చూపుతుంటారు. అటువంటిది సాయంత్రం 8 గంటల తరువాత నడక దారిలో భక్తులను అనుమతించుకుంటే ఇబ్బందులు తప్పవంటున్నారు. పైగా వందల ఏళ్లగా నడక మార్గంలో భక్తులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటి వరకూ వన్యమృగాలు ఎవరిని ఇంత వరకూ వన్యమ్రుగాల దాడిలో ఎవరూ బలైన దాఖలు లేవు..ఎప్పుడో ఒకప్పుడూ ఎదో చిన్న చిన్న సంఘటనలు జరిగాయని కఠిన నిర్ణయాలు సరికాదంటున్నారు. గతంలో చిరుత దాడికి పాల్పడినప్పుడు రాత్రి 12 నుంచి ఉదయం 3 గంటల వరుకు అనుమతించే వారు కాదు.. ఇప్పుడు ఏకంగా 13 గంటల పాటు నడక మార్గాన్ని మూసివేయానలడం సరికాదంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అంటున్నారు. ఘాట్ రోడ్డులో వేగా నియంత్రణ కూడా 20కిలో మీటర్ల వేగాన్ని మించకుండా ప్రయాణం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే ఘాట్ రోడ్డులో ఇది సాధ్యం అయ్యే పని కాదని స్పష్టంగా తెలుస్తోంది.

ప్రతిపాదనల్లో ఉన్న తొమ్మిది అంశాలపై నిపుణుల సలహాలు తీసుకొని తదుపరి చర్యలు తీసుకోవాలని టీటీడీ విజిలెన్స్, అర్బన్ పోలీస్ విభాగం యోచిస్తోంది.. వన్య ప్రాణులు సంచరించిన ప్రాంతాలలో వేగా నియంత్రణ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని టీటీడీ భావిస్తోంది. ఘాట్ రోడ్డు నిబంధనలు అమలు చేస్తే శ్రీవారి భక్తుల రద్దీ తగ్గే అవకాశముంది. దీంతో శ్రీవారి హుండి ఆదాయానికి కూడా గండి పడనుంది.

తిరుమల కనుమ దారుల్లో ఎలాంటి కొత్త నిబంధనలు టీటీడీ అమలు చేయనుందో మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే

Next Story

RELATED STORIES