అవంతిభాయ్‌ విగ్రహ ఏర్పాటు వివాదం : వీడియోను విడుదల చేసిన పోలీసులు

అవంతిభాయ్‌ విగ్రహ ఏర్పాటు వివాదం : వీడియోను విడుదల చేసిన పోలీసులు

హైదరాబాద్‌ జుమ్మెరాత్‌ బజార్‌లో రాణి అవంతిభాయ్‌ విగ్రహ ఏర్పాటు వివాదం రాజకీయ దుమారం రేపుతోంది. విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే రాజా సింగ్‌, బీజేపీ శ్రేణులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ తన మద్దతుదారులతో కలిసి ఆందోళనకు దిగడంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. ఈ ఘర్షణలో రాజాసింగ్ తలకు గాయమైంది.. దీంతో ఆయనను హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

బీజేపీ ఎమ్మెల్యేలు, నేతల పట్ల కేసీఆర్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారాయన. పోలీసులతో ఎమ్మెల్యే రాజాసింగ్ పై దాడి చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో రాజాసింగ్‌ పరామర్శించిన ఆయన పోలీసులు, ప్రభుత్వం ఎంఐఎంకు కొమ్ముకాస్తోందంటూ మండిపడ్డారు.

మరో వైపు తనను తానే రాయతో మోదుకొని.. రాజాసింగ్ హైడ్రామాకు తెరదీశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా పోలీసులు విడుదల చేశారు.

2009లోనే రాణి అవంతి బాయ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు రాజాసింగ్. విగ్రహాన్ని తీసుకొస్తుండగా అసీఫ్‌నగర్‌ ఏసీపీ తమపై లాఠీ ఛార్జ్‌ చేశారన్నారు. ఈ ఘటనలో తన తలకు గాయమైందని రాజాసింగ్ చెప్పారు. తనను చంపాలని అనుకుంటే రాయితో కొట్టండని రాయిని ఏసీపీకి ఇచ్చానని, ఎలా కొట్టాలో చూపించానని అన్నారు. కనీసం తాను చెప్పే మాట కూడా వినేందుకు పోలీసులు సిద్ధంగా లేరని విమర్శించారు.

రాష్ట్రంలో బీజేపీ నేతలపై రోజురోజుకు దాడులు అధికమవుతున్నాయని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. ఈ దాడి వెనుక కుట్ర ఉందని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story